దొంగల ముఠా అరెస్టు
ఖలీల్‌వాడి: ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో చోరీకి పాల్పడిన దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. నాగారం ప్రాంతానికి చెందిన షేక్ సాదక్, సురేకర్ ప్రకాశ్, సయ్యద్ షాదుల్లా, సాయినాథ్ విఠల్‌రావులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. ఈ ముఠా సభ్యులు గతంలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైనట్లు తెలిపారు. ఈ నెల 5న అర్ధరాత్రి నలుగురు ముఠా సభ్యులు నాందేవ్‌వాడలోని సాయి బాలాజీ టాన్స్‌పోర్టు కార్యాలయంలో చొరబడి కౌంటర్‌లో దాచిన రూ.10.27లక్షలను అపహరించారని పేర్కొన్నారు. ట్రాన్స్‌పోర్టు యజమాని నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చేపట్టామన్నారు. శనివారం ఉదయం బైపాస్ రోడ్‌లో వాహనాల తనిఖీ చేపడుతుండగా అనుమానంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి పాల్పడినట్లు అంగీకరించారని ఏసీపీ వెల్లడించారు. చోరీ జరిగిన 48 గంటల్లోనే సీసీఎస్ సీఐ సురేశ్, టౌన్ సీఐ శ్రీనివాసరాజు, త్రీటౌన్ ఎస్సై హరిబాబు ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నట్లు వివరించారు. కాగా, అపహరించిన సొత్తులో నుంచి రూ.10వేలను నిందితులు జల్సాలకు వినియోగించగా, మిగతా రూ.10.17లక్షల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాపై పీడీయాక్టు నమోదు కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. చోరీ కేసు చాకచక్యంగా ఛేదించిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
రూ.10.17 లక్షల నగదు స్వాధీనం
పీడీ యాక్ట్ నమోదుకు సిఫారసు
ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment