మూడేళ్లుగా చోరీలు..
కామారెడ్డి క్రైం: మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠాలో ఉన్న మరికొందరు వ్యక్తులు, చేసిన నేరాలు, సొత్తు రికవరీ అంశాలపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చంద్రశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం పట్టణంలోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మూడు సంవత్సరాలుగా జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులుగా వెల్లడైంది. నిందితులను మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సి పట్టణానికి చెందిన శేఖ్ ఇమ్రాన్ ఇస్మాయిల్, షేక్ వాజీద్‌గా గుర్తించారు. మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడిన వీరు కామారెడ్డి ప్రాంతంలో దాదాపు 40 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు నేరం అంగీకరించారని సీఐ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీసీఎస్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ ఉస్మాన్, కానిస్టేబుళ్లు రవి, సురేందర్, గణపతి, శ్రావణ్, రాజేందర్, కిషన్‌లను అభినందించారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
దాదాపు 40 కేసుల్లో నిందితులు
Comments
Please login to add a commentAdd a comment