
రాత్రికి రాత్రే ఇసుక తోడేస్తున్నారు
ఖలీల్‌వాడి: మంజీర పరీవాహకంలో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. రాత్రివేళ పొక్లెయినర్లు, ట్రాక్టర్ లోడర్స్‌తో ఇసుక తోడేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి రూ. లక్షల్లో గండిపడుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టేవారు మూడు గ్రూపులుగా మారి తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఒక గ్రూపు అధికారులను మచ్చిక చేసుకుంటుండగా, మరో గ్రూపు మంజీరా పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వించి టిప్పర్‌లలో పంపిస్తారు. మూడో గ్రూపు ఇసుక టిప్పర్లకు ఎస్కార్ట్‌గా మారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్నా పోలీసులు, రెవెన్యూ, మైనింగ్, ఆర్టీఏ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
సామర్థ్యానికి మించి తరలింపు..
పొతంగల్ మండలం కల్లూర్, కొడిచర్ల, పొతంగల్, హంగార్గా, సుంకిని, రెంజల్ మండలంలోని నీలా, కందకుర్తి ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో కొందరు ఇంటిపనుల కోసం ఇసుకను తరలిస్తుండగా, మరికొందరు ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి తరలించిన ఇసుకను డంప్‌లుగా చేసుకుంటున్నారు. అనంతరం అక్కడి నుంచి టిప్పర్‌లలో సామర్థ్యానికి మించి తీసుకెళ్తున్నారు. రాత్రివేళలో ఇసుక అక్రమదందా కొనసాగుతుందని తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక టిప్పర్లతో ప్రమాదాలు జరిగినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
వే బిల్లులు లేకుండానే..
ఇసుక తరలింపునకు సంబంధిత టిప్పర్లు, ట్రాక్టర్ల యజమానులు మీ సేవల్లో దరఖాస్తు చేసుకొని వాటికి చలాన్ కట్టాల్సి ఉంటుంది. అనంతరం జారీ అయిన వే బిల్లుతో ప్రభుత్వం కేటాయించిన రీచ్ నుంచి ఇసుకను తీసుకువెళ్లాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి నిబంధనలు ఉండవు. రాత్రివేళల ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి టిప్పర్‌లలో నిజామాబాద్, బోధన్ వంటి ప్రాంతాలకు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇలా తరలించిన ఇసుకకు ఎలాంటి వే బిల్లులు ఉండవు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
పొతంగల్, రెంజల్ పరిధిలోని
మంజీరా పరీవాహకంలో తవ్వకాలు
అక్రమంగా టిప్పర్‌లలో తరలింపు
పట్టించుకోని పోలీసులు,
రెవెన్యూ, ఆర్టీఏ అధికారులు
ప్రభుత్వ ఆదాయానికి గండి
ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి
వే బిల్లు లేకుండానే రాత్రివేళ టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. రెవెన్యూ, పోలీసులు, మైనింగ్, ఆర్టీఏ అధికారులకు విన్నవించినా ఫలితం కనిపించడం లేదు. ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే ఇసుక అక్రమ రవాణాను అరికట్టవచ్చు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి రాత్రివేళలల్లో తనిఖీ చేపట్టాలి.
– లింగారెడ్డి, నిజామాబాద్ లారీ ఓనర్స్, బిల్డింగ్
మెటీరియల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment