
ప్రతిపాదిత స్థలాలు ఫైనలయ్యేనా?
ఆర్మూర్: జిల్లాలో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గురుకులాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ పరిశీలించిన స్థలాలు సమీకృత స్కూళ్ల నిర్మాణానికి ఫైనల్ అవుతాయా? అనేది చర్చనీయాంశమైంది. ఒక్కో ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనుండగా, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు రెండు నెలల క్రితం పలు స్థలాలను ప్రతిపాదించారు. ఆర్మూర్ నియోజకవర్గానికి మంజూరైన స్కూల్‌ను అంకాపూర్ శివారులోని 493/1 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి విజ్ఞప్తి చేయగా, కలెక్టర్ ప్రతిపాదనలు పంపారు. మరో రెండింటిని నవీపేట్ మండలం దర్యాపూర్, డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామశివార్లలో నిర్మించాలని కలెక్టర్ ప్రతిపాదనలు పంపారు. అయితే అధికార పార్టీ నాయకులు రెండు చోట్ల వేరే స్థలాలను సూచించడంతో కలెక్టర్ వాటిని సైతం పరిశీలిస్తున్నారు. ఆర్మూర్ పట్టణ శివారులోని పిప్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక ప్రాంతం, బోధన్ మండలం బెలాల్ గ్రామ శివారులోని మధుమలంచ డిగ్రీ కళాశాల స్థలంలో సమీకృత గురుకులాలను నిర్మించాలని అధికార పార్టీ నాయకులు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా విద్యార్థులు, తల్లిదండ్రులు సులభంగా పాఠశాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం ఉన్న చోటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
కామారెడ్డి ఎస్పీ బాధ్యతల స్వీకరణ
కామారెడ్డి క్రైం : జిల్లా ఎస్పీగా నియమితులైన రాజేశ్ చంద్ర సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ ఎస్పీగా పని చేసిన సింధు శర్మ హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో రాజేశ్ చంద్ర వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆయనను జిల్లాకు చెందిన పలువురు పోలీసు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సమీకృత గురుకులాలకు నిధులు కేటాయించిన సర్కారు
స్థల కేటాయింపు ప్రతిపాదనలు పంపిన కలెక్టర్
రెండు చోట్ల వేరే స్థలాలను సూచిస్తున్న అధికార పార్టీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment