పన్ను వసూళ్లకు మెప్మా సిబ్బంది
● అదనంగా మరో 40 (హెచ్‌హెచ్‌డీ)
మిషన్ల కోసం ప్రతిపాదనలు
● వేగంగా వసూళ్ల కోసం బల్దియా
అధికార యంత్రాంగం చర్యలు
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కా ర్పొరేషన్‌కు రావాల్సిన పన్నుల కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ సంవత్సరం రావాల్సిన పన్నులు, పాత బకాయిలు, జరిమానాలు, నీటి పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టిసారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 20 రోజుల సమయం మాత్రమే మిగిలివుంది. దీంతో మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. రెవెన్యూ సిబ్బందితోపాటు తాను కూడా రోడ్డుబాట పట్టారు. దుకాణాలు తిరుగుతూ పన్నులు చెల్లించాలని సూచిస్తున్నారు. మొండి బకాయిదారులపై కొరడా ఝులిపిస్తున్నారు.
ఇప్పటివరకు రూ.30 కోట్లు వసూలు..
పన్నుల రూపేనా బల్దియాకు దాదాపు రూ.90 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ. 29.80 కోట్లు వసూలు చేశారు. కేవలం వారం రోజుల్లోనే రూ.4 కోట్ల వరకు వసూలు చేశారు. మరో 10 రోజుల వ్యవధిలో రూ. 15 కోట్ల వరకు పన్నులు వసూలు చేయాలని అధికారులు లక్ష్యం నిర్ధేశించారు. ఆదివారం, రెండో శనివారం, ఇతర సెలవు దినాల్లో సైతం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 80 మంది వరకు సిబ్బంది పన్ను వసూళ్ల విధుల్లో ఉన్నారు.
వీరితోపాటు తాజాగా మెప్మా విభాగానికి చెందిన సిబ్బంది సేవలు సైతం వినియోగించనున్నారు. వీరిలో బల్దియాలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్, 8 మంది సీవోలున్నారు. నగరంలో ఆర్‌పీలు (రిసోర్సు పర్సన్‌లు) 200 మంది వరకు ఉన్నారు. బిల్ కలెక్టర్లతోపాటు ఆర్పీలు, సీవోల సహాయంతో పన్నులు వసూలుచేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ సూచించారు. ఈమేరకు వారితో ప్రత్యేక సమావేశం సైతం నిర్వహించారు.
మున్సిపల్ కార్యాలయం
ఆర్పీలు సహకరించాలి
బల్దియా పన్నుల వసూళ్ల కోసం మెప్మా సిబ్బంది సహకారం కూడా తీసుకుంటున్నాం. నగరంలోని ఆర్పీలు క్షేత్రస్థాయిలో సహకరించాలి. వారి సహకారంతో పన్నుల వసూళ్లు వేగవంతం అవుతాయి. బల్దియాకు చెల్లించాల్సిన పన్నులను నగరవాసులు వెంటనే చెల్లించాలి.
–దిలీప్‌కుమార్,
మున్సిపల్ కమిషనర్, నిజామాబాద్
అవగాహన కల్పించాలి
నిజామాబాద్ బల్దియాలో పన్నుల వసూళ్ల కోసం మెప్మా సిబ్బందిని కమిషనర్ భాగస్వామ్యం చేశా రు. క్షేత్రస్థాయిలో బిల్ కలెక్టర్లకు ఆర్పీలు సహకరించాలి. ఆయా డివిజన్లలో తెలిసినవారికి పన్నులు చెల్లించేలా ఆర్పీలు అవగాహన కల్పించాలి. పన్ను వసూళ్లకు పూర్తి సహకారం అందించాలి.
–చిదుర రమేష్,
మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్
సరిపోని మిషన్లు..
పన్నుల వసూళ్ల కోసం బల్దియా అధికారులు హాండ్ హెల్డు డివైజ్ (హెచ్‌హెచ్‌డీ) మిషన్లను వాడుతున్నారు. ఈ మిషన్లు బిల్లు కలెక్టర్ల ఆధీనంలో ఉంటాయి. బల్దియాలో ఇప్పటివరకు 38 మిషన్లు మాత్రమే ఉన్నాయి. నగరంలో 60 డివిజన్లు ఉండగా, మరో 40 మిషన్ల కోసం కమిషనర్ సీడీఎంఏకు సమాచారం ఇచ్చారు. దాంతో యాక్సిస్ బ్యాంక్‌వారు 40 మిషన్లు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈనేపథ్యంలో మంగళవారం నుంచి పన్ను వసూళ్లు వేగవంతం కానున్నాయి. మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ నేరుగా పన్నుల వసూళ్లలో నేరుగా పాల్గొంటున్నారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి వారి వెంట పన్నుల వసూళ్లకు వెళుతున్నారు. పన్నులు చెల్లించనివారి దుకాణాలు సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 15 దుకాణాలు సీజ్‌చేశారు. చెల్లించాల్సిన పన్నులకు సంబంధించిన సొమ్ము బిల్ కలెక్టర్‌కు నేరుగా చెల్లించి రసీదు పొందాలి. బల్దియా కార్యాలయంలో, మీసేవా కేంద్రాల్లో, ఆన్‌లైన్‌లో కూడా పన్నులు చెల్లించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment