వర్ష సూచన... రైతుల్లో ఆందోళన
డొంకేశ్వర్(ఆర్మూర్): వాతావరణ మార్పులతో జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. వడగళ్లు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు గురువారం జిల్లా వ్యవసాయ, ఇతర సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేరవేసింది. సమాచారం అందే సమయానికి జిల్లాలో వాతావరణ పరిస్థితులు సైతం మారిపోయాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు కనిపించాయి. బోధన్ మండలం కల్దూర్కి, సాలూరా ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. అయితే రైతులు యాసంగిలో సాగు చేసిన వరి పంట చేతికొచ్చే దశలో ఉంది. బోధన్ లాంటి కొన్ని చోట్ల వరికోతలు కూడా మొదలయ్యాయి. మామిడి తోటల్లో కూడా కాయలు మధ్య దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో జిల్లాకు వర్షాలు, వడగళ్ల సూచన రావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వరి, మామిడి పంటలపై వడగళ్లు ఎక్కడ దాడి చేస్తాయోనని కలవరపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగవగా 1లక్షల ఎకరానికి పైగా కోత దశలో ఉంది. గతేడాది కూడా దే సమయంలో వడగళ్ల వాన పంటలను దెబ్బతీసి రైతులను నష్టానికి గురి చేసింది.
వడగళ్లు కురిసే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment