గల్ప్‌ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి | Gulf Wapsi JAC Demands To Pay Rs 5 Lakh Ex Gratia to the families Of Who died in Gulf | Sakshi
Sakshi News home page

గల్ప్‌ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి

Published Fri, May 27 2022 3:29 PM | Last Updated on Thu, Jul 28 2022 3:32 PM

Gulf Wapsi JAC Demands To Pay Rs 5 Lakh Ex Gratia to the families Of Who died in Gulf - Sakshi

విదేశాలలో అసువులు బాసిన ప్రవాసీ కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరుతూ గ్రామ ప్రజలు, గల్ఫ్ వాపసీలు గల్ఫ్ జెఏసి డిమాండ్‌ చేసింది.  జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామంలో శుక్రవారం జరిగిన ఓ గల్ఫ్‌ కార్మికుడి శవయాత్రలో జేఏసీ నేతలు పాల్గొన్నారు.

వాల్గొండకు చెందిన గుంటి బర్నబ్బ (42) ఇటీవల యూఏఈ రాజధాని అబుదాబిలో గుండెపోటుతో చనిపోయారు. అబుదాబి నుండి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించడానికి ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ కృషి చేసింది. సహచర కార్మికుడు గజ్జి శంకర్ అబుదాబి నుండి శవపేటికతో పాటు వచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వాల్గొండ వరకు శవపేటిక రవాణాకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించింది. మృతుడికి భార్య అమృత, కుమారులు అజయ్, హర్షవర్ధన్ ఉన్నారు. 

గల్ఫ్ దేశాలలో సంవత్సరానికి సుమారు 200 మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు చనిపోతున్నారు. గత ఎనిమిది ఏళ్లలో  సుమారు 1,600 మంది తెలంగాణ ప్రవాసీల మృతదేహాలు శవపేటికలలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా వారి స్వగ్రామాలకు చేరుకున్నాయి. కొందరి మృతదేహాలకు గల్ఫ్ దేశాలలోనే అంత్యక్రియలు జరిగాయని జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  

గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృత ధన సహాయం) ఇవ్వాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ కోరారు. గల్ఫ్ ప్రవాసీ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్ లో ప్రతి సంవత్సరం రూ. 500 కోట్లు కేటాయించాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల కోరారు.  ప్రవాసి అంతిమయాత్రలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గుగ్గిల్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసి నాయకుడు మెంగు అనిల్, గ్రామ సర్పంచ్ దండిగ గంగు - రాజన్న, గ్రామస్తులు, గల్ఫ్ వాపసీలు తదితరులు పాల్గొన్నారు.  

చదవండి:  ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement