జస్టిస్‌ ఫర్‌ వేజ్‌ తెఫ్ట్‌.. ఊపందుకున్న ఉద్యమం | International Migrants Day Special Article By Bhim Reddy Manda | Sakshi
Sakshi News home page

International Migrants Day: కనీస వేతనం, విదేశీ భవన్‌.. ఇంకా మరెన్నో..

Published Sat, Dec 18 2021 1:57 PM | Last Updated on Sat, Dec 18 2021 2:11 PM

International Migrants Day Special Article By Bhim Reddy Manda - Sakshi

మానవ వలస అనేది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న ప్రక్రియ. వలసలకు, అభివృద్ధికి, మానవ వికాసానికి సంబంధం ఉన్నది. వలస వెళుతున్న పౌరులందరి కోసం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 18 ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా (ఇంటర్నేషనల్ మైగ్రంట్స్ డే) గా ప్రకటించింది. ఈమేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ) 31 ఏళ్ల క్రితం 18 డిసెంబర్ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో "అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ" గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

అంతర్జాతీయ వలసలు
ఉన్న ఊరిలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లడం వలసలకు ఒక కారణం కాగా,  అధిక వేతనాలు మరింత మెరుగైన జీవం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం మరొక కారణం. పల్లెల నుండి పట్టణాలకు గాని, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి గాని వెళ్లడాన్ని అంతర్గత వలసలు అంటారు. ఒకదేశం నుండి మరొకదేశానికి వెళ్లడాన్ని అంతర్జాతీయ వలసలు అంటారు.

కోవిడ్‌ మరణాలు
కోవిడ్ పరిస్థితుల వలన  తెలంగాణ నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికుల పరిస్థితి మరింత దిగజారింది. కోవిడ్ కారణంగా ఆరు గల్ఫ్ దేశాలలో 3,576 మంది భారతీయులు చనిపోయారు. వీరిలో 200 కు పైగా తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. సౌదీ అరేబియా (1,154), యుఏఇ (894), కువైట్ (668), ఓమాన్ (551), బహరేన్ (200), ఖతార్ (109). 

వందే భారత్‌లో
కోవిడ్ సందర్భంగా గల్ఫ్‌ దేశాల నుంచి భారత్ కు 'వందే భారత్ మిషన్' లో 7,16,662 మంది వాపస్ వచ్చారు. వీరిలో ఒక లక్షమంది తెలంగాణ వారు ఉన్నారని ఒక అంచనా. యుఏఇ (3,30,058), సౌదీ అరేబియా (1,37,900), కువైట్ (97,802), ఓమాన్ (72,259), ఖతార్ (51,190), బహరేన్ (27,453) వేల మంది భారతీయులు ఇండియాకి తిరిగి వచ్చారు.

జస్టిస్‌ ఫర్‌ వేజ్‌ తెఫ్ట్‌
కరోనా సమయంలో గల్ఫ్ నుండి హడావిడిగా వెళ్లగొట్టబడిన కార్మికులకు జీతం బకాయిలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) రాబట్టుకోవడం కోసం 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' అనే ఉద్యమం నడుస్తున్నది. వాపస్ వచ్చిన వలస కార్మికుల పునరావాస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు స్పష్టం చేసింది. వాపస్ వచ్చినప్పుడు అధిక విమాన చార్జీలు, క్వారంటైన్ ఖర్చులు తడిసి మోపెడైనాయి. 

భారంగా మారిన తిరుగు ప్రయాణం
కరోనా తగ్గుముఖం పట్టడంతో వాపస్ వచ్చిన వలస కార్మికులు తిరిగి గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. కరోనా టెస్టులు, అధిక విమాన చార్జీలు ఇబ్బంది పెడుతున్నాయి. కొత్తగా ఉద్యోగుల రిక్రూట్మెంట్ కూడా పుంజుకుంటున్నది. కరోనా సందర్భంగా రిక్రూటింగ్ ఏజెన్సీలను ఆదుకోవడానికి సెక్యూరిటీ  డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల నుంచి రూ. 25 లక్షలకు, రూ. 8 లక్షల నుంచి రూ. 4 లక్షలకు తగ్గించింది. వలస కార్మికులు చెల్లించే సర్వీస్ చార్జీలు రూ.30 వేలు దీనిపై 18 శాతం జీఎస్టీ మాత్రం తగ్గించలేదు. 

ప్రవాసీ విధానం
ఎన్నారైలు పంపే విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు జరుగుతున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ప్రవేశపెట్టాలని, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండు చాలాకాలంగా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడున్నర ఏళ్లలో 1500 కు పైగా తెలంగాణ ప్రవాసులు గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో మృతి చెందారు. గల్ఫ్ మృతుల కుటుంబాలు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం ఎదిరి చూస్తున్నారు. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి, పునరావాసానికి కృషి చేయాలని కోరుతున్నారు. 

ఆన్‌లైన్‌ ఓటింగ్‌
38 ఏళ్లనాటి ఎమిగ్రేషన్ యాక్టు, 1983 స్థానంలో నూతన ఎమిగ్రేషన్ యాక్టు, 2021 ను తీసుకరావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఎన్నారైలకు 'ప్రాగ్జీ' ఓటింగు (ప్రతినిధి ద్వారా, పరోక్ష పద్ధతిలో ఓటు వేయడం) లేదా ఆన్ లైన్ ఓటింగు సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల జైళ్లలో మగ్గుతున్న 2,183 మంది భారతీయులు న్యాయ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. 

కనీస వేతనం
గల్ఫ్ దేశాలలో పనిచేసి భారతీయ కార్మికులకు భారత ప్రభుత్వం కనీస వేతనాలను తగ్గిస్తూ సర్కులర్లను జారీ చేసింది. అన్నివర్గాల ఒత్తిడితో ఆ తర్వాత ఆ సర్కులర్లను రద్దు చేశారు. భారత విదేశాంగ మంత్రి గల్ఫ్ దేశాలలో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

విదేశీ భవన్‌ కావాలి
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ముంబయి లో ఏర్పాటు చేసిన విధంగా "విదేశ్ భవన్" ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి. ఈ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ (సమీకృత సముదాయం) లో పాసు పోర్టు ఆఫీసు, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ఆఫీసు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) రీజినల్ ఆఫీసు, విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రెటేరియట్ లు ఉంటాయి. 

అధికారికంగా
తెలంగాణ ప్రభుత్వం 'ప్రవాసీ తెలంగాణ దివస్' ను అధికారికంగా నిర్వహించాలి. విదేశాలలో, స్వదేశంలో ఉన్న తెలంగాణ ప్రవాసి  సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి హైదరాబాద్ కేంద్రంగా ఒక విశ్వవేదిక ఏర్పాటు చేసుకొని తమ హక్కుల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్భంగా ప్రవాసులు అందరికీ శుభం జరగాలని ఆశిస్తూ ...

- మంద భీంరెడ్డి (+91 98494 22622 )
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement