తన భార్య మరణానికి వారి నిర్లక్ష్యమే కారణమంటూ ఓ రిసార్ట్, బోట్ కెప్టెన్‌పై ఒక భారతీయ-అమెరికన్ దావా వేశారు. ఫ్లోరిడాలో గత ఏడాది పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో భారత్‌లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరావు అలపర్తి భార్య మృతి చెందారు. ఆయన కొడుకు, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ప్రమాదానికి వాటర్ ఫ్రంట్ రిసార్ట్, బోట్ కెప్టెన్‌ల నిర్లక్ష్యమే కారణమంటూ తాజాగా ఆయన వారిపై దావా వేశారు.
శ్రీనివాసరావు అలపర్తి మన్రో కౌంటీ సర్క్యూట్ కోర్టులో బోట్ కెప్టెన్, అతని సహాయకుడు, రిసార్ట్ యాజమాన్యంపై 68 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 2022 మే 30న శ్రీనివాసరావు, ఆయన భార్య సుప్రజ (33), వారి పదేళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల మేనల్లుడు ఫ్లోరిడా కీస్‌లో పారాసైలింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత బోట్ కెప్టెన్ డేనియల్ కౌచ్ పారాసైల్‌ను బోట్‌కి అనుసంధానించే టౌలైన్‌ను కత్తిరించాడు. దీంతో సుప్రజ, ఇద్దరు పిల్లలు రెండు మైళ్ల దూరం గాలిలో తేలుతూ కాంక్రీట్ వంతెనకు తగిలారు. ఈ ప్రమాదంలో సుప్రజ మృతి చెందగా పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
బోట్ సిబ్బంది వాతావరణ సూచనను గమనించి, యూఎస్ కోస్ట్ గార్డ్‌కు సమాచారం అందించడంలో విఫలమయ్యారని శ్రీనివాసరావు తన దావాలో ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బంది తమకు లైఫ్ జాకెట్లు వంటి తగిన భద్రతా పరికరాలను అందించలేదని, నియంత్రణ కోల్పోయిన తర్వాత పారాసైల్‌ను సరిగ్గా కిందికి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment