అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి కిడ్నాప్‌.. విషాదం | NRI News: Hyderabad Student Mohammed Abdul Missing Found Dead | Sakshi
Sakshi News home page

అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి కిడ్నాప్‌.. విషాదం

Published Tue, Apr 9 2024 9:36 AM | Last Updated on Tue, Apr 9 2024 11:44 AM

NRI News: Hyderabad Student Mohammed Abdul Missing Found Dead - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్థాంతరంగా ముగిసింది. కనిపించకుండా పోయిన హైదరాబాద్‌ విద్యార్థి అబ్దుల్‌ మహ్మద్‌ అరాఫత్‌.. విగత జీవిగా పోలీసులకు కనిపించాడు. తమ కుమారుడ్ని డ్రగ్స్‌ మాఫియా కిడ్నాప్‌ చేసిందని, కాపాడాలంటూ అతని తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అరాఫత్‌ను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  

హైదరాబాదీ విద్యార్థి మృతిని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతని ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సెర్చ్‌ ఆపరేషన్‌ ద్వారా తీవ్రంగా యత్నించారని.. కనిపించకుండా పోయిన మూడు వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అబ్దుల్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశం ఉంచింది.
 

ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని, విద్యార్థి మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి పంపేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది.  

అదే చివరిసారి.. 
నాచారంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన మహ్మద్‌ సలీమ్‌ కుమారుడు అబ్దుల్‌ మహ్మద్‌ అరాఫత్‌(25) 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. నిత్యం ఫోన్‌లో మాట్లాడే అతను చివరిసారి మార్చి నెల 7న తండ్రితో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి స్పందనలేదు. ఆ మరుసటిరోజునే అబ్దుల్‌ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దీనిని అబ్దుల్‌ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది.

అబ్దుల్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో  తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మార్చి 9వ తేదీన ఎంబీటీ నేత అమ్జద్‌ ఉల్లా ఖాన్‌ సాయంతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీమ్‌ బంధువులు క్లీవ్‌లాండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు.

అబ్దుల్‌ అరాఫత్‌ చివరిసారి మార్చి 8వ తేదీన క్లీవ్‌లాండ్‌లోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కనిపించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు అక్కడి పోలీసులు సమాచారమిచ్చారు. ఇంకోవైపు రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో అబ్దుల్‌ తండ్రి మరోసారి కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. చివరకు.. మార్చి 18న చికాగోలోని ఇండియన్ కౌన్సిల్ సహాయం కోరిన బాధిత కుటుంబం

తండ్రికి వాట్సాప్‌ కాల్‌
ఆ వెంటనే.. మార్చి 19వ తేదీన అబ్దుల్‌ తండ్రికి కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. అబ్దుల్‌ను తాము కిడ్నాప్‌ చేశామని.. 1200 అమెరికా డాలర్లు వెంటనే పంపించాలని డిమాండ్‌ చేశారు.  డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే డబ్బులిచ్చేందుకు అంగీకరించిన సలీం.. అబ్దుల్‌ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపాలని అడిగారు. దీనికి ఆగ్రహించిన కిడ్నాపర్లు ఫోన్‌ పెట్టేడయంతో సలీం ఆందోళన చెందారు. వెంటనే ఆయన ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలోనూ తమ కుమారుడిని రక్షించాలంటూ మీడియా సాక్షిగా అధికారులు కోరారాయన. అయితే.. చివరకు ఆ తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి.

ఇదిలా ఉంటే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన విద్యార్థులే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. 2024 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11 మంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement