
"వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా", "వంశీ ఇంటర్నేషనల్" "శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్" , "శుభోదయం" సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, గత శనివారం సాయంత్రం అంతర్జాల మాధ్యమం ద్వారా, 12 దేశాల నుండి సుమారు 75 మంది కవులు కవయిత్రులతో "అంతర్జాతీయ కవిసమ్మేళనం" అద్వితీయంగా జరిగింది. "పింగళి వెంకయ్య గారు రూపొందించిన భారత జాతీయ జండా యొక్క 102వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, దీనికి పింగళి వెంకయ్య గారి మనుమడు జివియన్ నరసింహం జ్యోతి ప్రకాశన చేసి ప్రారంభించారని" నిర్వాహకులు తెలిపారు
భారతదేశం నుండి ప్రముఖ కవులు కవయిత్రులతో పాటుగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, యూకె, దక్షిణ ఆఫ్రికా, కెనడా, అమెరికా దేశాల నుండి కవులు పాల్గొని, "భారతదేశ జాతీయ సమైక్యత - విశిష్టత" అనే అంశంపై తమ కవితలు వినిపించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా వంగూరి చిట్టెన్ రాజు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్న కుమార్, వంశీ వ్యవస్థాపకులు డా వంశీ రామరాజు తమ ప్రసంగాలను అందించారు. కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభను నిర్వహించగా, కృష్ణవేణి సహ వ్యాఖ్యాతగా సహకరించారు. శుభోదయం మీడియా ద్వారా ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
Comments
Please login to add a commentAdd a comment