సింగపూర్: సింగపూర్‌లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్, టాస్-మనం తెలుగు వారి సహకారంతో అంగరంగ వైభవంగా శనివారం బతకమ్మ సంబరాలు జరిగాయి. ఈ పండుగను సింగపూర్ తెలుగు సమాజం వారు సుమారు 12 సంవత్సరాలుగా దిగ్విజయంగా ప్రతీ ఏడాది నిర్వహిస్తోంది. కరోనా కోరల్లో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు వారందరి క్షేమం మేరకు ప్రత్యేక ఉద్దేశంగా ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలను సాంఘిక మాధ్యమాల ద్వారా జరిపారు. కోవిడ్-19 నిబంధనలు కారణంగా, ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఐదుగురు-ఐదుగురు సమూహంగా జూం యాప్ ద్వారా, అధిక సంఖ్యలో తెలుగింటి ఆడపడుచులు సింగపూర్ నలువైపులా నుంచి ఆటపాటలతో, కోలాటాల విన్యాసాలతో సద్దుల బతుకమ్మ సంబరాలలో ఆనందంగా పాల్గొని వేడుక జరుపుకున్నారు. క్లిష్ట సమయంలో సైతం పండుగ శోభ ఏమాత్రం తగ్గకుండా రకరకాల పువ్వులతో అనేక రంగురంగులతో తీర్చిదిద్దిన బతుకమ్మలు అందరినీ అలరించాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జూమ్ యాప్ ద్వారా ఈ వేడుకను ఉద్ధేశించి మాట్లాడారు. కోవిడ్-19 పరిస్థితుల్లో కూడా సింగపూర్‌లోని తెలుగు వారు పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె బతుకమ్మ పండుగ విశిష్టతను ఆంతర్యాన్ని వివరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ... మనిషి ప్రకృతితో మమేకమయ్యే పండుగలలో అతి పెద్దదైన ఈ బతుకమ్మ పూల పండుగ ఘనమైన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. వెయ్యి సంత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ పండుగను సింగపూర్‌లో సాంప్రదాయబద్ధంగా పెద్దఎత్తున నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారందికీ ఈ సందర్భంగా తెలుగు సమాజం తరుపున ఆయన బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
సింగపూర్ తెలంగాణా ఫ్రెండ్స్ తరుపున కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఒకే ప్రదేశంలో పెద్ద ఎత్తున పండగ చేసుకొనే మనం ప్రత్యేక పరిస్ధితులలో జూమ్ ద్వారా కూడా అట్టహాసంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. టాస్- మనం తెలుగు తరుపున అనితా రెడ్డి మాట్లాడుతూ... ప్రాంతాలు, మాండలికాలు వేరైనా అందరం కలసికట్టుగా, సంసృతి సాంప్రదాయాలతో పాటు బంధాలు తెలిపే పండుగ ఈ బతుకమ్మ అని తెలియజేశారు. చివరగా ఈ కార్యక్రమం నిర్వహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్న మాట్లాడుతూ... ఆన్ లైన్ ద్వారా ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా పాల్గొన్నారని చెప్పారు. అదే విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేశామన్నారు. ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు, సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్ సభ్యులు, టాస్ - మనం తెలుగు వారికి , స్పాన్సర్‌లకు కార్యదర్శి సత్యచిర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment