సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో అనాదిగా నిర్వహిస్తూ వస్తున్న సంక్రాంతి సందడి వేడుకలు, ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం.. ఈ ఏడాది కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. సింగపూర్‌లో నివసిస్తున్న బాలబాలికలు, యువతీ యువకులతో వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలతో రంగవల్లులు, చిన్నారులతో చిత్రలేఖనం పోటీలను నిర్వహించి, కార్యక్రమ వీక్షకులతోనే విజేతలను నిర్ణయించి బహుమతులను అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో సింగపూర్ కాలమానంలో గుణించిన సింగపూర్ తెలుగు క్యాలెండెర్-2021ను ఆవిష్కరించారు.
సంబురాల్లో భాగంగా నిర్వహించిన వైవిధ్యభరితమైన కహూట్ ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవటంతో పాటు అన్ని వయస్సుల వారిని ఆసాంతం ఆకట్టుకున్నాయి. అన్ని వయనుల వారు ప్రత్యేకమైన ఆటపాటలతో అలరించి, పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఉత్సవాల్లో పాల్గొన్న తెలుగు వారందరికీ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి సంక్రాతి శుభాకాంక్షలతో పాటు స్వాగత వచనాలు పలికారు. గత మూడు సంవత్సరాలుగా తమ కార్యవర్గాన్ని ఆదరించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు కూడా తెలుగువారందరి సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు చేపడతామన్నారు. అలాగే తెలుగు సమాజం సొంత భవనం కలను త్వరలో సాకారం చేసుకోగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమ నిర్వహణ కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి పుల్లన్న, ప్రసాద్ బచ్చు మాట్లాడుతూ.. కోవిడ్ అంక్షల కారణంగా అందరిని ప్రత్యక్షంగా కలవలేకపోయామని, అయినా కూడా అంతర్జాలంలో నిర్వహించిన కార్యక్రమాన్ని సుమారు 500 మంది వరకు వీక్షించారని పేర్కొన్నారు. ప్రతి ఏడాది భోగి పండుగకు ఉచితంగా పంపిణీ చేసే రేగుపండ్లను ఈ ఏడాది పంపిణీ చేయలేకపోయామని వారు పేర్కొన్నారు. ఉత్సవ నిర్వహణకు ఆధ్యంతం సహకరించిన స్వచ్ఛంద సేవకులకు, కార్యవర్గానికి, స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment