లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుంచి సుమారు 1200కి పైగా తెలుగు, ఇతర ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్ఝల్ కియానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్లుగా సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు స్థానికులను ఆకట్టుకున్నాయి.
ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి, బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన మహా శక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్ఝల్ కియానీ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా,ముఖ్యంగా లండన్ వీధుల్లో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయన్నారు. అనంతరం బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేకంగా సత్కరించి బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment