సాక్షిప్రతినిధి,విజయవాడ: ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అంతరం పెరిగిపోయింది. చివరకు వ్యక్తిగతంగా దూషణలకు దిగే స్థాయికి దిగజారారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలో దుర్గమ్మ దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా స్వాగతం పలకడానికి వచ్చిన టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. అమ్మవారి దర్శనం సందర్భంగా చంద్రబాబు అంతరాలయంలోకి వెళ్లేటప్పుడు ఓ వర్గం నాయకులు దేవినేని ఉమా, కేశినేని చిన్ని వర్గానికి చెందిన వారు ముందుగానే తోసుకొంటూ లోపలికి వెళ్లారు.
దీంతో ఎంపీ కేశినేని నానితో పాటు, మరికొంత మంది పార్టీనేతలు, లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. దీంతో చంద్రబాబు కేశినేని నానిని పిలవాలంటూ, తన భద్రతా సిబ్బందికి చెప్పారు. భద్రతా సిబ్బంది సార్ పిలుస్తున్నారు లోపలికి రావాలంటూ కేశినేని నానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. లోపల స్థలం లేదులే, ఇక్కడే ఉంటామని కేశినేని నాని వారికి చెప్పినట్లు తెలిసింది.
చివరకు దేవినేని ఉమా బయటకు వచ్చి, కేశినేని నాని భుజంపై చెయ్యి వేసి, లోపలికి వెళ్లాలని కోరారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఎంపీ కేశినేని నాని, భుజంపైన వేసిన చెయ్యి విసిరికొట్టి, ‘యూజ్‌లెస్ ఫెలో’ మంత్రిగా ఉన్న నాలుగేళ్లు మీకు ఎవ్వరూ కనిపించలేదు, పార్టీని భ్రష్టు పట్టించావని ఊగిపోయారు. ఊహించని పరిణామం ఎదురు కావడంతో దేవినేని ఉమా సైలెంట్‌గా ఉండిపోయినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
వర్గాలను ప్రోత్సహించడంతోనే...
పార్టీ మనుగడ కోసం చంద్రబాబు, లోకేష్‌లే వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ పార్టీ ముఖ్య నేతలే పేర్కొంటున్నారు. ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా అతని సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారు. దీనిపై బహిరంగంగానే ఎంపీ పార్టీ అధిష్టానంపై ఇప్పటికే పలుమార్లు విరుచుకుపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎంపీ పార్టీ కేశినేని నాని ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మూడు వర్గాలు పనిచేస్తున్నాయి. ఎంపీ మాత్రం పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బేగ్‌ను ప్రమోట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల సమాయత్తంలో భాగంగా ఇటీవల పార్టీ కార్యాలయంలో మైనార్టీ నాయకులకు నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. రెండు వర్గాలుగా చీలిపోయి, పరస్పరం చేయిచేసుకున్నారు. ఇటీవల జరిగిన దళిత శంఖారావంలో సైతం ఎంపీ కేశినాని ఫొటో చిన్నదిగా పెట్టి, ఏ హోదాలో లేని చిన్ని ఫోటో బ్యానర్‌పై పెట్టారని టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. తనకు వ్యతిరేకంగా దేవినేని ఉమాతో పాటు, నగరంలోని కొంతమంది పార్టీ నేతలను చంద్రబాబుతో పాటు, చినబాబు ప్రోత్సహిస్తున్నారని ఎంపీ కేశినేని నాని రగిలిపోతున్నారు.
దీంతో మైలవరంతో పాటు, నగరంలో ఈ వర్గాలకు వ్యతిరేకంగా ఎంపీ కేశినేని నాని సైతం పావులు కదుపుతున్నారు. వరుస పరాజయాలకు తోడు, అంతంతమాత్రంగానే ఉన్న టీడీపీ పరిస్థితి, వర్గ విభేదాలతో పూర్తిగా దిగజారిపోతోందని, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ వర్గ విభేదాలతో ఎలాంటి దుష్పరిణామాలకు చూడాల్సి వస్తుందోనని పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment