వరద దెబ్బకు పడిపోయిన రిజిస్ట్రేషన్లు
బుడమేరు పరిసర ప్రాంతాలలో కొనుగోలు చేసేందుకు విముఖత
ఇచ్చిన అడ్వాన్సులు వదులుకుంటున్న వైనం
ఇళ్లు ఖాళీ చేస్తున్న వరద బాధితులు
అయోమయంలో బిల్డర్‌లు
మధురానగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరద రియల్‌ఎస్టేట్ రంగాన్ని ఛిదిమేసింది. ఇప్పటి వరకు నగరంలోని తక్కిన ప్రాంతాలతో దీటుగా రామకృష్ణాపురం, దేవీనగర్, గద్దె వెంకట్రామయ్యనగర్, దావుబుచ్చయ్యకాలనీ, వినాయకనగర్, గుణదల, అజిత్‌సింగ్‌నగర్ తదితర ప్రాంతాలలో క్రయ విక్రయాలు జరిగేవి. ఆ పరిసర ప్రాంతాలలో గజం రూ. 35వేల నుంచి రూ. 45వేల వరకు వెళ్లింది. ఈ ప్రాంతాలలో బుడమేరు వరద ప్రభావం ఉండదని రియల్టర్‌లు ప్రచారం చేయటంతో కనీసం మురుగుకాలువలు, రోడ్డు వంటి మౌలిక సదుపాయాలు, లే అవుట్‌లు లేకున్నప్పటికీ పెట్టుబడిదారులు, బ్రోకర్‌లు ఎగబడి కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
కొనుగోలుదారులు హడల్..
ఈ ప్రాంతాలలో బుడమేరు వరద పోటెత్తటంతో ఇటువైపు కొనుగోలుదారులు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన వారు సైతం వాటిని వదిలేసుకుంటున్నారు. తమకు వరద ముంపు బెడద ప్రాంతాలు అవసరం లేదంటూ కొనుగోలు దారులు తెగేసి చెప్పటంతో కృత్రిమంగా రేట్లను పెంచేసి అధిక రేట్లకు విక్రయిస్తున్న బ్రోకర్‌లు భయాందోళనలకు గురవుతున్నారు. తాము పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వస్తుందో రాదో నంటూ బెంబేలెత్తిపోతున్నారు. ఆయా ప్రాంతా లలో నిర్మాణాలు చేస్తున్న బిల్డర్‌లు ప్లాట్‌లను కొనుగోలు చేసేవారు ముందుకు రాకపోవటంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో కొనుగోలుదారులు అధికంగా ఉండటంతో బిల్డర్‌లు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మరీ అనధికారిక నిర్మాణాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్లాట్‌లు అమ్ముడవుతాయో లేదో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
అద్దెకు కూడా వద్దు..
ఏ సౌకర్యాలు లేకున్నప్పటీకీ ప్రశాంతంగా ఉండవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రాంతాలకు వచ్చి అద్దెకుంటున్న వారు కూడా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. వరద వల్ల పడిన కష్టాలు చాలని వేరే ప్రాంతాలకు వెళ్లిపోతామని చెబుతున్నారు. ప్రభుత్వం వరద సాయం ఇచ్చేస్తే ఇళ్లు ఖాళీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన నిర్మాణాల ఈఎంఐలు ఏ విధంగా కట్టాలోనని భవన యజమానులు ఆందోళన చెందుతున్నారు.
వరద సాయం అందేనా?
వరద నీరు ముంచెత్తిన గద్దె వెంకట్రామయ్యనగర్, వినాయకనగర్, దావు బుచ్చయ్యకాలనీలో వరద సాయం ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని ఇళ్లలోకి ప్రవేశించగా మరికొన్ని ఇళ్ల వద్ద రోడ్లపై నడుంలోతు నీళ్లు రోజుల తరబడి నిలిచిపోయాయి. అయితే అధికారులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన రిజిస్ట్రేషన్‌లు
ఆయా ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాల రిజిస్ట్రేషన్లు కూడా గణనీయంగా పడిపోయాయి. కొనుగోలుదారులు అక్కడ వేటినీ కొనేందుకు ముందుకు రావడం లేదు. బుడమేరు వరదకు ముందు గాంధీనగర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు సుమారు 70 నుంచి 80వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం కేవలం సుమారు 30 రిజిస్ట్రేషన్ల వరకు మాత్రమే జరుగుతున్నాయి. అలాగే గుణదల రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు సుమారు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్‌లు జరిగేవి. ప్రస్తుతం 10 నుంచి 20 రిజిస్ట్రేషన్‌లు మాత్రమే జరుగుతున్నాయి. వాటిలో కూడా వీలునామా, మార్ట్‌గేజ్ తదితర రిజిస్ట్రేషన్‌లు ఎక్కువ. కొనుగోలుదారులు వరద ముంపు ప్రభావం లేని ప్రాంతాల వైపు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇటీవల కాలంలో విజయవాడ శివారు ప్రాంతాలు బాగా అభివృద్ధిచెందుతున్నాయి. కోర్ సిటీలో స్థలాల లభ్యత లేకపోవడంతో అందరూ నగర శివారు ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. నిర్మాణాలు బాగా పెరిగాయి. సిటీలోని రణగొణ ధ్వనులకు దూరంగా ఉండాలనుకునేవారు, ప్రశాంతత కోరుకునే వారు కూడా అటువైపు ఇళ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బుడమేరు వరద ఎఫెక్ట్ వల్ల ఆ ప్రాంతాల్లో తాము ఉండలేమంటూ చాలా మంది బయటకు వస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా కుదేలైంది.
Comments
Please login to add a commentAdd a comment