కృష్ణలంకలో అగ్నిప్రమాదం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణలంక, 20వ డివిజన్‌లో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని మూడు పోర్షన్లు కలిగిన తాటాకు ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఆయా పోర్షన్లలో నివాసం ఉంటున్న కుటుంబసభ్యులు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడగా.. సామాన్లన్నీ కాలి బూడిదయ్యాయి. సేకరించిన వివరాల మేరకు.. 20వ డివిజన్, ద్వారకానగర్‌లో నిర్మలా శిశుభవన్ సమీపంలో అల్లమల్ల ఆంజనేయులుకు మూడు పోర్షన్లు కలిగిన తాటాకు ఇల్లు ఉంది. ఒక పోర్షన్‌లో అతను తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుండగా.. మధ్య పోర్షన్‌లో అతని తల్లి అల్లమల్ల లక్ష్మి ఒంటరిగా ఉంటోంది. మరో పోర్షన్‌లో బొచ్చా రమణమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి అద్దెకు ఉంటున్నారు. ఆదివారం రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయారు. రాత్రి సుమారు 12గంటల సమయంలో రమణమ్మ కుమారుడు టాయిలెట్‌కు వెళ్లేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. తన ఇంటిపై తాటాకు కాలిపోతూ మంటలు వ్యాపించడాన్ని చూసి పెద్దగా కేకలు వేశాడు. ఏం జరిగిందోనని మూడు పోర్షన్లలో నివాసం ఉంటున్న వారితో పాటు చుట్టుపక్కల వారు ఇళ్లల్లోనుంచి బయటకు వచ్చి చూశా రు. అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి మిగతా రెండు పోర్షన్లకు సైతం అంటుకోవడంతో క్షణాల్లో పూర్తిగా దగ్దమయ్యాయి. మూడు ఇళ్లల్లోని వంటసామగ్రి, మంచాలు, బీరువాలు, ఫ్రిడ్జ్‌లు, బట్టలు, టీవీలు, కుట్టుమిషన్లు, పిల్లలు పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డులు విలువైన వస్తువులన్నీ చూస్తుండగానే పూర్తిగా కాలిపోవడంతో మూడు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, కృష్ణలంక పోలీసులు గంట పాటు శ్రమించి ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. కళ్ల ముందే ఇల్లు కాలిపోవడంతో కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
ఆహుతైన తాటాకిల్లు
కట్టుబట్టలతో మిగిలిన మూడుకుటుంబాలు
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
కృష్ణలంకలో అగ్నిప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment