
మినుము రైతులు దిగాలు
● ఆశాజనకంగా దిగుబడులు ● మార్కెట్‌లో ధర లేని వైనం ● ఆర్థికంగా నష్టపోయామంటున్న రైతులు ● గతేడాది రబీలో రూ.9,100 పలికిన క్వింటా ధర
కంకిపాడు: సీజన్ మారుతుందే కానీ రైతుల కష్టాలు మాత్రం మారటం లేదు. ఒడిదుడుకులు అధిగమించి పంట చేతికి వచ్చిందని సంతోషించినా మార్కెట్‌లో సరైన ధర లేకపోవటంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. గతేడాదితో పోలిస్తే భారీగా ధరలు నేలచూపులు చూస్తుండటంతో మినుము రైతుల గుండెలు గుభేల్‌మంటున్నాయి. ఆరుగాలం కష్టించినా అరకొరే చేతికి అందుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాజిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో ఈ ఏడాది రబీ సీజన్‌లో 2,84,237 ఎకరాల్లో మినుము సాగు చేపట్టారు. ప్రధానంగా ఎల్‌బీజీ, పీయూ 31, టీబీజీ, ఇతర విత్తన రకాలను రైతులు సాగుకు ఎంపిక చేసుకున్నారు. గడిచిన వారం రోజులుగా జిల్లాలో మినుము తీత పనులు సాగుతున్నాయి. ఇప్పటికే 30 శాతం మినుము తీతలు పూర్తయ్యి పంట మార్కెట్‌కు చేరినట్లు వ్యవసాయశాఖ అంచనా.
ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి..
ఈ ఏడాది రబీ సీజన్‌లో మినుము దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే సాగు ఆరంభం నుంచి తెగుళ్లు, పురుగు ఉధృతి పంటపై అధికంగా ఉంది. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లాకు తెగులు విజృంభించటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు సరాసరిన పైరు సంరక్షణ, యాజమాన్య చర్యలకు రూ.25 వేల వరకూ పెట్టుబడులు అయ్యేవి. అలాంటిది ఈ ఏడాది పల్లాకు, మచ్చల పురుగు, ఫంగస్‌ల కారణంగా యాజమాన్య చర్యలకు అదనంగా రూ.15 వేల వరకూ పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకూ దిగుబడులు వస్తాయని ఆశించారు. పంట చేతికి వచ్చే సరికి ఆరు క్వింటాళ్ల నుంచి ఎనిమిది క్వింటాళ్ల లోపు మాత్రమే దిగుబడులు వస్తున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో వరి పంట భారీ వర్షాలు, కృష్ణానది వరదల కారణంగా దెబ్బతినంటంతో ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ప్రత్యేకించి కౌలు ఒప్పందం ఖరీఫ్‌కు 20 బస్తాలు పైగా చేసుకుని సాగు చేపట్టిన కౌలురైతులు రెండో పంట రబీలో ఆరుగాలం కష్టించినా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని భావించారు. అయితే దిగుబడులు కూడా మోస్తరుగానే దక్కటంతో రైతుల్లో దిగులు నెలకొంది.
ధర నేలచూపులు..
ఈ ఏడాది మార్కెట్‌లో మినుము ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ మద్దతు ధర రూ.7,400గా ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ధర రూ.7,500 నుంచి రూ.7,800 పలుకుతోంది. గత సీజన్‌లో పంట చేతికి అందే నాటికి క్వింటా మినుము వ్యాపారులు రూ.9,300 నుంచి రూ.9,500 వరకూ ధర చెల్లించి కొనుగోళ్లు చేశారు. కానీ ప్రస్తుతం ఆ ధర పలకటం లేదు. గతంతో పోలిస్తే క్వింటాకు రూ.1800కు పైగా నష్టానికి పంట అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర నిర్ణయం చేయటంతోనే సరైనా ధర పలకటం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో పంటను నిల్వ చేసుకుని మంచి ధర వస్తే విక్రయించుకునే యోచనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment