
కాలువల్లో అవినీతి మేట
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పంట కాలువలు, డ్రెయిన్లలో అవినీతి ‘పూడిక’ అధికమవుతోంది. దీనికి కారణం నీటి పారుదల శాఖ అధికారుల తీరే. కృష్ణా డెల్టా పరిధిలో కాలువలు, డ్రెయిన్లు తూటుకాడ, గుర్రపు డెక్కతో కనిపిస్తున్నాయి. చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి. ఇవన్నీ తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
గతేడాది ఆలస్యంగా..
కాలువల మరమ్మతులు, నిర్వహణ పనులకు టెండర్లను ఆలస్యంగా పిలుస్తున్నారు. గతేడాది జూన్‌లో కాలువలకు నీరు విడుదల చేశారు. ఆ తర్వాత, కాలువల, డ్రెయిన్ల నిర్వహణకు రూ.32.79 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. కాలువలకు నీరు విడుదల చేయడంతో పనులు చేసే పరిస్థితి లేదు. దీంతో స్థానిక ప్రజాప్రతి నిధుల కనుసన్నల్లో కొంతమంది కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. పనులు చేయకుండా నిధులు మింగేయడానికి కొంతమంది కాంట్రాక్టర్లు ఏకంగా 40–48 శాతంపైగా లెస్‌కు వేసి పనులు దక్కించుకున్నారు. ఈ ఏడాది మే వరకు పనులు చేసే అవకాశం ఉంది. అయితే పనులు దక్కించుకొన్న కాంట్రాక్టర్లు , నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మక్కై నామ మాత్రంగా పనులు చేసి, బిల్లులు చేయించుకొని దండుకొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఈ ఏడాది పనులకు టెండర్లు పిలవడానికి ఈ సమయం అనువుగా ఉంటుంది. అలా చేయకపోతే చివరి ఆయకట్టు నీరు అందే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. ఎక్కువ వర్షం కురిస్తే డ్రెయిన్లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
టెండర్లు పూర్తి అయినా.. చేయని పనులు
గతేడాది కొంత మంది కాంట్రాక్టర్లు 40–48 శాతంపైగా తక్కువకు టెండర్లు వేసి పనులు దక్కించుకున్నారు. కాలువలో నీరు, డ్రెయిన్లలో నీరు ప్రవహిస్తే గుర్రపు డెక్క కొట్టుకొచ్చి షట్టర్ల వద్ద ఆగుతుంది. అక్కడ యంత్రాలతో తీసి కొంతమంది మమ అనిపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి రైతులకు పెను శాపంగా మారుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అధ్వానంగా డ్రెయిన్లు
వర్షం వస్తే..రైతులకు కంటిమీద కునుకు ఉండని పరిస్థితి కృష్ణా డెల్టాలో నెలకొంది. కొద్ది పాటి వర్షానికే డ్రెయిన్‌లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ,పెడన నియోజక వర్గాల పరిధిలో ఎక్కువగా పంట పొలాలు మునుగు తున్నాయి. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పూడికలు తీయక డ్రెయిన్లు అధ్వానంగా మారాయి. గుర్రపుడెక్క, తూటుతో మేట వేసుకుపోయాయి. నియోజకవర్గంలో బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్‌ఎస్ మేజర్ డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకొడు, వన్నేరు, ముస్తాఫాకోడు, యూటీ,పెద్దలంక, గుండేరు, రత్నకొడు డ్రెయిన్లలో రోజుల తరబడి గుర్రపుడెక్క, నాచు, తూటు దట్టంగా పేరుకుపోయి మురుగునీరు సక్రమంగా దిగువకు పారని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్‌ఎన్‌పురం వరకు ఉన్న బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుంది. గతేడాది దీని తొలగింపునకు అధికారులు టెండర్లు పిలిచి పనులు అప్పగించినా చేయకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. చంద్రయ్య డ్రెయిన్ గుడివాడ నుంచి మండవల్లి మండలం పెనుమాకలంక వరకు గుర్రపుడెక్క మేటవేసి నీరు వెళ్లని పరిస్థితి నెలకొంది. తమిరిశ వంతెన, పోలుకొండ రెగ్యులేటర్ వద్ద అలముకున్న గుర్రపుడెక్కతో వంతెనలకు ప్రమాదం పొంచి ఉంది. నందివాడ నుంచి మండవల్లి మండలం నందిగామలంక వరకు ప్రవహిస్తున్న నెహ్రాల్లీ డ్రెయిన్ రాళ్లకోడు డ్రెయిన్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి.
డ్రెయిన్లలో పేరుకున్న తూటు, గుర్రపుడెక్క గతేడాది రూ.32.19 కోట్లతో టెండర్లు పనులు చేయని కాంట్రాక్టర్లు చివరి ఆయకట్టుకు అందని సాగునీరు రైతుల్లో ఆందోళన
పర్యవేక్షణ గాలికి వదిలేశారు
డ్రెయిన్ల పర్యవేక్షణకు నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మౖకై పనుల నిర్వహణను గాలికి వదిలేశారు. డ్రెయిన్లలో గుర్రపుడెక్క, తూటు కన్పిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి.
– రవి, రైతు లింగవరం
తూటు, డెక్క తొలగించడం లేదు
బుడమేరు డ్రెయిన్‌లో పుట్టగుంట వద్ద నుంచి గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఏటా కాంట్రాక్టర్లు కాంట్రాక్టు తీసుకోవడమే గాని పనులు చేపట్టిన దాఖలాలు లేవు. ఇటీవల సంభవించిన వరదలకు పంట పొలాలు, గ్రామాలు ముంపునకు గురై తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.
– ఆంజనేయులు, రైతు ఒద్దులమెరక
గత ఏడాది టెండర్లు పిలిచిన పనులు
డివిజన్ పనుల విలువ
సంఖ్య (కోట్లలో)
కృష్ణా తూర్పు 42 8.49
కృష్ణా సెంట్రల్ 40 6.77
డ్రెయిన్ గుడివాడ 73 16.41
స్పెషల్ 05 1.12
మొత్తం 160 32.79

కాలువల్లో అవినీతి మేట

కాలువల్లో అవినీతి మేట
Comments
Please login to add a commentAdd a comment