మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి
భవానీపురం(విజయవాడపశ్చిమ): మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీదుర్గామల్లేశ్వర మహిళా కళాశాల విద్యార్థినులతో కలిసి వారు డప్పు వాయించి ఆకట్టుకున్నారు. మహిళా లబ్ధిదారులకు ఆటోలు, బైక్‌లు అందజేశారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలను అందిస్తున్న మహిళా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. నేటి తరం మహిళలు ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎదగటం శుభపరిణామమన్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు జిల్లాలోని అన్ని విభాగాలు సమష్టిగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం పోలీస్ యంత్రాంగం వినూత్న కార్యక్రమాలను చేపడుతోందన్నారు. నగరంలో మహిళలు స్వేచ్ఛగా, సురక్షితంగా జీవించేందుకు అనుకూల పరిస్థితులను కల్పించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, సీడబ్ల్యూసీ మెంబర్ రాధాకుమారి, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు చెన్నుపాటి కీర్తి, మార్పు ట్రస్ట్ డైరెక్టర్ సూయజ్, డీఎఫ్‌ఓ చక్రాణి, అరవ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు
Comments
Please login to add a commentAdd a comment