మామిడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
ప్రధాన శాస్త్రవేత్త కనకమహాలక్ష్మి సూచన
గన్నవరం రూరల్: మామిడి తోటలలో సస్యరక్షణ చర్యలు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని నూజివీడు మామిడి పరిశోధన కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.కనకమహాలక్ష్మి రైతులకు సూచించారు. మండలంలోని గోపవరపుగూడెం గ్రామంలో శుక్రవారం ఆమె జిల్లా ఉద్యానవన అధికారి జె.జ్యోతితో కలసి మామిడి తోటలు పరిశీలించారు. అనంతరం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కనకమహాలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం కొన్ని తోటలలో తేనె మంచు పురుగు, తామర పురుగు, బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు గమనించామన్నారు. ఈ పురుగులు, తెగుళ్ల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 ఎంఎల్ లేదా సాప్ 2జీ హెక్సకోనజోల్ 2జీ లేదా యాన్‌ట్రాకోల్ 2జీ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలన్నారు. మామిడి మొక్క వయస్సు, భూమి తేమ శాతం బట్టి నీరు పారించాలన్నారు. పిందెలు పసుపు రంగుకు మారి రాలిపోతుంటే ఫ్లానోఫిక్స్ 0.2 ఎంఎల్ లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలన్నారు. డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ మామిడి రైతులకు కవర్‌లు అందుబాటులో 50 శాతం రాయితీపై ఇస్తున్నామని చెప్పారు. కావాల్సిన రైతులు ఉద్యానవన సిబ్బందిని సంప్రదించాలన్నారు. మండల హార్టీ కల్చర్ అధికారి ఇ.హరిచంద్, ఉద్యానవన సహాయకులు వి.దీక్ష, కౌశిక్, భవాని, మాజీ సహకార బ్యాంకు అధ్యక్షుడు నల్లూరి కోటేశ్వరరావు, కొత్తలంక వెంకట్రామయ్య, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment