
ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు అప్రెంటీస్ మేళా
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఈ నెల 10వ తేదీ సోమవారం అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ కోర్సు పాస్ అయ్యి అప్రెంటీస్ పూర్తి కాని అన్ని ట్రేడ్‌ల అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు. అభ్యర్థులు వారి విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఈ అప్రెంటీస్ మేళా జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 77804 29468 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.
రోడ్డు ప్రమాదంలో
ట్రాక్టర్ డ్రైవర్ మృతి
పెనుగంచిప్రోలు: రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన స్థానిక చెరువు కట్ట సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన ఇమ్మడి నరసింహారావు(35) మామిడి కర్ర లోడుతో ట్రాక్టర్‌పై పెనుగంచిప్రోలు నుంచి కొణకంచి వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న నరసింహారావు కింద పడిపోగా ఆయనపై కర్రలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వేస్టేషన్‌లో
గుర్తు తెలియని వ్యక్తి..
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ 1లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. దీన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజా సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉంటాయని, ఒంటిపై నీలం, ఆకుపచ్చ గళ్ల లుంగీ, కాషాయం రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడని, కుడి చేతిపై శివుని బొమ్మతో పచ్చ బొట్టు ఉందని, ఇతర ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. అనారోగ్యంతో మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు విజయవాడ జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని కోరారు.

ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు అప్రెంటీస్ మేళా
Comments
Please login to add a commentAdd a comment