ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇటీవల ముగిసిన ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభమైంది. విజయవాడలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఈ ప్రక్రియకు ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ నెల మొదటి తేదీన ప్రారంభమైన ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్‌లో ప్రధాన సబ్జెక్ట్‌ల పరీక్షలు ఇటీవలే పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 17 నుంచి మూల్యాంకనం ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. గురువారం నుంచి అధ్యాపకులు పూర్తి స్థాయిలో మూల్యాంకనం ప్రక్రియకు హాజరవుతున్నారు.
జిల్లాకు వచ్చిన జవాబు పత్రాలు..
ఎన్టీఆర్ జిల్లాకు వివిధ జిల్లాల నుంచి సుమారుగా 4,08,565 జవాబు పత్రాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల ఏడో తేదీ నాటికి సంస్కృతం పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. అప్పుడే అరకొరగా మూల్యాంకనాన్ని ప్రారంభించినా ఈ నెల 17వ తేదీకి పూర్తిస్థాయిలో పేపర్లు చేరుకోవటంతో తాజాగా గురువారం నుంచి ఊపందుకుంది. ప్రస్తుతం సంస్కృతం, తెలుగు, ఇంగ్లిష్, హిందీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్లు జిల్లాకు చేరుకున్నాయి. మరో ఒకటి, రెండు రోజుల్లో ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్లకు సంబంధించిన మూల్యాంకనం ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
దఫదఫాలుగా అధ్యాపకులు..
జిల్లాలో జరుగుతున్న మూల్యాంకనం కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 450 మంది అధ్యాపకులు గురువారం నాటికి అధికారులకు రిపోర్ట్ చేశారు. అందులో భాగంగా సంస్కృతం 13, తెలుగు–6, ఇంగ్లిష్–21, హిందీ–1, మ్యాథ్స్–40, సివిక్స్–6 చొప్పున బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బోర్డులో ఒక చీఫ్ ఎగ్జామినార్, ఐదుగురు అసిస్టెంట్ ఎగ్జామినర్లతో పాటుగా ఒక స్కూృట్నీజర్ ఉంటారు. అదేవిధంగా ఈ నెలలో మరో మూడు దఫాల్లో మరికొంతమంది అధ్యాపకులు ఈ మూల్యాంకనంలో పాల్గొననున్నారు.
ఏప్రిల్ మొదటి వారం వరకూ కొనసాగనున్న స్పాట్ వాల్యూయేషన్ జిల్లాకు చేరుకున్న 4,08,565 పేపర్లు రిపోర్ట్ చేసిన 450 మంది అధ్యాపకులు
మార్క్స్ టేబులేషన్ ప్రక్రియ..
స్పాట్ వాల్యూయేషన్‌లో భాగంగా జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటుగా మార్క్స్ టేబులేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గతంలో అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకనం చేసిన పత్రాలను చీఫ్ ఎగ్జామినార్ పరిశీలించి వాటిని ఇంటర్మీడియెట్ బోర్డుకు పంపించేవారు. అక్కడ కోడ్ ప్రకారం విద్యార్థులకు మార్కులు కేటాయించి అంతిమంగా ఫలితాలను విడుదల చేసేవారు. అయితే దీనిలో కొంత జాప్యం జరుగుతుండటంతో స్పాట్ వాల్యూయేషన్‌లోనే జవాబు పత్రాలు మూల్యాంకనం అయిన తరువాత మార్క్స్ టేబులేషన్‌ను (స్కానింగ్ ప్రక్రియ) నిర్వహిస్తున్నారు. దీనివల్ల జాప్యం లేకుండా ఫలితాలను త్వరగా ప్రకటించటానికి అవకాశం ఏర్పడుతుంది. గత ఏడాది నుంచి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ప్రక్రియను ప్రారంభించింది.
అధ్యాపకులను స్పాట్‌కు
పంపించాలి..
స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమించిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపాల్స్ రిలీవ్ చేసి పంపించాలి. ఇప్పటికే స్పాట్ పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకూ ఈ మూల్యాంకనం ప్రక్రియ కొనసాగనుంది. కళాశాల ప్రాంగణంలో ఉన్న సదుపాయాలు, పేపర్ల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులను రెండు మూడు దఫాలుగా హాజరయ్యే విధంగా ఏర్పాటు చేశాం. విధులు కేటాయించిన అధ్యాపకులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే.
– సీఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి, ఆర్‌ఐవో, ఎన్టీఆర్ జిల్లా
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment