చిన్నారుల సంక్షేమానికే ‘మిషన్ వాత్సల్య’
జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న మిషన్ వాత్సల్యను లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన గ్రామ, వార్డు స్థాయి కమిటీలు క్రియాశీలకంగా పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. గురువారం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య–శిశు సంక్షేమ, రక్షణ జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది.
ప్రత్యేక కమిటీలు..
కలెక్టర్ మాట్లాడుతూ శిశు సంరక్షణ చట్టాలు, కుటుంబ ఆధారిత సంరక్షణకు ప్రోత్సాహం, సంస్థాగత మద్దతు, ఆర్థిక సహకారం, శిశు సంరక్షణ పథకాలు తదితరాల అనుసంధానంతో మిషన్ వాత్సల్య అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్ చైర్మన్‌గా గ్రామ, వార్డుస్థాయి కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు 15 రోజులకోసారి తప్పనిసరిగా సమావేశం కావాలని సూచించారు. డివిజన్ స్థాయిలో కమిటీలకు వర్క్‌షాప్‌లు నిర్వహించాలని.. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, విద్యా సాధికారత, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లో శిశు మద్దతు కార్యకలాపాలు, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు తదితరాలపై కమిటీ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవల సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య, డీసీపీ కేజీవీ సరిత, జెడ్పీ సీఈవో వై.కన్నమనాయుడు, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, జిల్లా శిశు సంరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జి.మహేశ్వరరావు, ఏసీపీ కె.లతాకుమారి, సాంఘిక సంక్షేమ అధికారి కేఎస్ శిరోమణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment