నిర్లక్ష్యమే ప్రాణం తీసింది!
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): బుడమేరు కాలువ లీకేజీల పూడ్చివేతలో అధికారులు నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణం బలి తీసుకుంది. కొండపల్లి శాంతినగర్ వద్ద శుక్రవారం లీకేజీలతో ఏర్పడిన గుంత లో ప్రమాదవశాత్తూ పడి బలుసుపాటి కుమార్(14)అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాలు..
కవులూరు గ్రామానికి చెందిన బలుసుపాటి పద్మారావు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. రిక్షా తొక్కి కాయకష్టంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు బిడ్డలను స్థానిక జెడ్పీ పాఠశాలలో చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రస్తుతం టెన్త్‌క్లాస్ పరీక్షలకు హాజరవుతుండగా, రెండో కుమారుడు బలుసుపాటి కుమార్ 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల సమీపంలో ఉన్న లీకేజీ గుంతల వద్దకు తన స్నేహితుడితో కలిసి వెళ్లగా ప్రమాదవశాత్తూ కాలుజారి గుంతలో పడి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మరో విద్యార్థి ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. అల్లారుముద్దుగా పెంచి పోషించుకున్న కుమారుడు కళ్లముందు నిర్జీవంగా ఉండటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.
ఈ పాపం ఎవరిది?
గత ఆగష్టు, సెప్టెంబర్లలో వచ్చిన వర్షాలతో కొండపల్లి వద్ద బుడమేరు కట్టలకు భారీస్థాయి గండ్లు పడి విజయవాడలో అనేక ప్రాంతాలను నీటితో ముంచెత్తింది. గండ్లను తాత్కాలికంగా పూడ్చి పని అయిపోయినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. అయితే పూడ్చిన గండ్లు వద్ద అనతి కాలంలో లీకేజీలు ఏర్పడి రైతులు పంటపొలాల్లో నీరు ప్రవహించి భారీస్థాయి గుంతలు ఏర్పడ్డాయి. వీటిని ఇప్పటికీ పూర్తిస్థాయిలో పూడ్చక పోవడంతో ఆ గుంతలో పడిన విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులకు తీరని వేదన మిగిలింది.
బుడమేరు లీకేజీ గుంతలో పడి
బాలుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment