సీఎం చంద్రబాబుకు ఉగాది పచ్చడి పంపుతాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వలంటీర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉగాది పచ్చడి పంపబోతున్నట్లు వలంటీర్ల అసోసియేషన్ ప్రకటించింది. శుక్రవారం విజయవాడ హనుమాన్ పేట సీపీఐ కార్యాలయంలో వలంటీర్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఉగాది పచ్చడి తింటూ.. వలంటీర్లకు తీపి కబురు చెబుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తానని, నెలకు రూ. 5వేలు ఎలా సరిపోతాయి? పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యవసర సరుకులు ధరలకు అనుగుణంగా రూ. 10వేలు గౌరవ వేతనం పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల ప్రచారంలో అనేక సభల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారన్నారు. కానీ అధికారంలోకి వచ్చి తర్వాత 10 నెలలు గడుస్తున్నా వలంటీర్లకు ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. మార్చి 30 ఉగాది సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వలంటీర్లు సీఎం చంద్రబాబు నాయుడుకు ఉగాది పచ్చడి పంపాలని పిలుపునిచ్చారు. వలంటీర్లు పంపిన పచ్చడి తిని వలంటీర్లకు ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు మమత, షైని, నరేష్, కల్యాణ్, శివ పార్వతి, స్వప్న, దమ్ము రమేష్ పాల్గొన్నారు.
ఏపీ గ్రామ, వార్డు వలంటీర్స్
వెల్ఫేర్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment