గీత.. కన్నీటి గాథ!
జి.కొండూరు: గ్రామీణ ప్రాంతాలలో ఫామ్ వైన్‌గా పిలుచుకునే తాటికల్లు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. తరతరాలుగా తాటికల్లును తీస్తూ ప్రజలకు అందిస్తున్న గౌడన్నలు ఆ వృత్తిని వదిలేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాల ఆదరణ కరువై ఆర్థికంగా ఎదుగుదల లేక.. ఆరోగ్యం సహకరించక, తాటిచెట్లు ఎక్కలేక ఒక్కొక్కరిగా వెనకడుగు వేస్తున్నారు. తాము దశాబ్దాలుగా పడిన కష్టాలు భవిష్యత్తులో తమ కుటుంబాలు పడకూడదనే ఆలోచనతో పిల్ల లను చదివించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు పంపుతున్నారు. ప్రస్తుతం నలభై ఏళ్లు పైబడిన వారు గౌడ సామాజిక వర్గంలో ఒకటి రెండు శాతం మంది మాత్రమే ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలు తాటికల్లు గురించి పుస్తకాలలో చదువుకోవాల్సి వచ్చేలా ఉంది.
బెల్టు షాపులతో కల్లుకు కాటు..
గతంలో తాటికల్లు లీటరు రూ.60 నుంచి రూ.100 వరకు ప్రాంతాల వారీగా డిమాండ్‌ను బట్టి విక్రయించేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా బెల్టుషాపులను తెరిచి మద్యం విక్రయించడంతో పాటు మద్యం రూ.99కి క్వార్టర్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో కల్లుకు డిమాండ్ తగ్గింది. తక్కువ ధర ఎక్కువ కిక్కు ఇస్తుండడంతో గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్యానికి మేలు చేసే కల్లును వదిలేసి మద్యం వైపు పరుగులు తీస్తున్నారు. దీనితో గీతకార్మికులు తాటి చెట్ల నుంచి తీసిన కల్లును తాగేవాళ్లు లేక పారబోస్తున్నారు. ఒక్క ఆదివారం మినహా మిగతా రోజుల్లో కల్లు విక్రయాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని చెబుతున్నారు.
మితం హితమే..
తాటికల్లు అనేక పోషకాలతో నిండి ఉంటుందని, తాజా కల్లుని మితంగా తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోటాషియంతో పాటు విటమిన్లు బీ,సీ,ఈ, ఐరన్ పుష్కలంగా ఉంటాయంటున్నారు. అదే సమయంలో కల్లుని అతిగా తాగినా, నిల్వ ఉంచి పులిసిన కల్లుని తాగినా ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వాల ఆదరణకు
నోచుకోని కల్లుగీత కార్మికులు
ఒక్కొక్కరిగా వృత్తిని
వదిలేస్తున్న గౌడన్నలు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో
12వేల మంది కల్లుగీత కార్మికులు
బెల్టు షాపులతో తీరని నష్టం
గీత.. కన్నీటి గాథ!
Comments
Please login to add a commentAdd a comment