
జేఈఈ మెయిన్స్ ప్రారంభం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మొయిన్స్ –2025 రెండో సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహి స్తున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకూ ఈ పరీక్షలు కొనసాగుతాయి. జిల్లాలోని ఐయాన్ డిజిటల్ జోన్ (కానూరు), శ్రీ విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూషన్స్ (ఎనికేపాడు), ఐయాన్ డిజిటల్ జోన్ (కండ్రిక), లకిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (మైలవరం) తదితర కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11,488 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాల వద్ద వేచి ఉండటంతో ఆయా ప్రాంతాలన్నీ సందడిగా మారాయి.
పృథ్వీశ్వరుడికి
అరుణకిరణాల అభిషేకం
చల్లపల్లి: మండలంలోని నడకుదురు క్షేత్రంలో స్వయంభూగా వెలసిన శ్రీబాల త్రిపుర సుందరీ సమేత శ్రీపృథ్వీశ్వరస్వామి ఆరుణ కిరణాలతో దేదీప్యమానంగా వెలుగొందుతూ బుధవారం సాయంత్రం భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. పురాతన ఆలయం కావటంతో స్వామి గర్భాలయం సుమారు ఐదు అడుగుల లోతులో ఉంటుంది. స్వామికి ఎదురుగా నేలమట్టంపై నాలుగు అడుగుల పీఠంతో ధ్వజస్తంభం ఉంది. దానికి ఎదురుగా సుమారు 40 అడుగుల రాజగోపురం, దానికి ముందు ఆరు అడుగుల ఎత్తున్న నందీశ్వరుడు, పైన 12 అడుగుల ఎత్తులో మంటపం ఇలా వరుసగా ఒకదాని వెనుక మరొకటి ఉన్నాయి. ఇన్ని అడ్డుగా ఉన్నప్పటికీ సూర్యకిరణాలు స్వామిని ఎలా తాకుతున్నాయనేది ఆశ్చర్యంగా ఉందని పలువురు భక్తులు పేర్కొన్నారు. ఏటా ఉగాది పండుగ ముగిసిన తరువాత ఒకటి రెండు రోజులు సాయంత్రం వేళల్లో సూర్యుని కిరణాలు స్వామిని తాకుతాయని ఆలయ అర్చకుడు పృథ్వీశర్మ తెలిపారు.
రైతుబజారులో మంత్రి మనోహర్ తనిఖీలు
ఆటోనగర్(విజయవాడతూర్పు): కొద్ది రోజుల నుంచి విజయవాడ ఏపీఐఐసీ రైతుబజారులో అన్ని రకాల కూరగాయలు దొరకడంలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఏపీఐఐసీ కాలనీ లోని రైతుబజారును మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా స్టాళ్లను సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు. కూరగాయల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. రైతు బజారులో టమాటా సహా పలు రకాల కూరగాయలు లేకపోవడాన్ని గుర్తించి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ, జేడీ ఎస్టేట్ అధికా రులు శ్రీనివాసరావు, రమేష్‌బాబు టమాటా ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. వారిద్దరు సరిగా సమాధానం ఇవ్వలేకపోయారు. అన్ని రకాల కూరగాయలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మరో సారి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని హెచ్చరించారు.

జేఈఈ మెయిన్స్ ప్రారంభం

జేఈఈ మెయిన్స్ ప్రారంభం