
నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి
కంకిపాడు: నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కొనుగోలు ప్రక్రియ సాగాలని, రైతులకు మద్దతు ధర లభించాలని మార్క్‌ఫెడ్ ఎండీ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. కంకిపాడు మార్కెట్‌యార్డులో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినుము, పెసలు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా అపరాల సేకరణ తీరుపై సిబ్బందిని వివరాలు అడిగారు. మార్క్‌ఫెడ్ ప్రత్యేకాధికారి కిషోర్, కొనుగోలు మేనేజర్‌లు నరసింహారెడ్డి, నళిని జిల్లాలోని 8 కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2,948 హెక్టార్లలో పెసలు సాగు చేయగా, 3,435 మెట్రిక్ టన్నులు దిగుబడు లు వస్తాయని అంచనా వేశారన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో రూ.1.36 కోట్ల విలువైన 157 మెట్రిక్ టన్నుల పెసలు సేకరించి సీడబ్ల్యూసీ గోదాముకి తరలించామన్నారు. మార్క్‌ఫెడ్ ఎండీ మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద ఎలాంటి జాప్యం జరగకుండా సేకరణ ప్రక్రియ, సొమ్ము చెల్లింపు వేగంగా జరిగేలా ఆన్ లైన్‌లో వివరాలను సమర్థంగా నమోదు చేయాలన్నారు. ఈ–క్రాప్ నమోదులో పంట నమోదు వ్యత్యాసం ఉందని రైతు చెప్పటంతో వ్యత్యాసం రావటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని రైతులు కోరారు. దీనిపై స్పందిస్తూ రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు మార్గదర్శకాలు జారీ అయ్యాయని, త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో ఏఓ పీఎం కిరణ్, ఏఈఓలు సూర్యభవాని, వాణి, వీఏఏ కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పెసలు కొనుగోలు కేంద్రం పరిశీలించిన మార్క్‌ఫెడ్ ఎండీ