
సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అమెరికా దిగుమతి సుంకాలను పెంచిన నేపథ్యంలో ఆక్వా రంగాన్ని గట్టెక్కించేందుకు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ తరహాలో నేషనల్ ప్రాన్స్ కో ఆర్డినేషన్ కమిటీ (ఎన్‌పీసీసీ) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అన్నారు. అమెరికా దిగుమతి సుంకాలను పెంచిన నేపథ్యంలో రైతులు, ఆక్వా రంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న రైతులు, ఎగుమతిదారులు, సీడ్, ఫీడ్ వ్యాపారులు ఇప్పటికే హార్వెస్టింగ్ దశలో ఉన్న రొయ్యలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని, లేని పక్షంలో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు.
ఆక్వా రంగం కోలుకునేలా చర్యలు తీసుకుంటాం..
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ సంక్షోభం తాత్కాలికమేనని, ఆక్వా రంగాన్ని ఆదుకుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కేవలం విదేశీ ఎగుమతులపైనే ఆధారపడకుండా, స్వదేశీ వినియోగం పెంచేలా పౌల్ట్రీలో నెక్ తరహాలో ఆక్వా రంగంలోనూ రొయ్య ఉత్పత్తిదారులతో ఓ కమిటీ వేసేందుకు ఆలోచన చేస్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆక్వా రైతులు ప్రభుత్వం ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందాలన్నా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే నిబంధన విధించినట్టు తెలిపారు. జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా రిజిస్ట్రేషన్‌లు చేయనున్నట్లు వివరించారు. దాణా ధర తగ్గింపు విషయంలోనూ తయారీదారులతో చర్చిస్తున్నామన్నారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎగుమతిదారులు– ఇతర రాష్ట్రాల అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్ రావు, వేగేశ్న నరేంద్రవర్మరాజు, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, జీఎఫ్‌ఎస్టీ డైరెక్టర్ సి. కుటుంబరావు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, ఆక్వా ఎగుమతిదారులు, ఉత్పత్తి దారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడును కోరిన ఆక్వా రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులు
నెక్ తరహాలో నేషనల్ ప్రాన్స్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు