
కుమారుడికి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
పెనమలూరు: ఆర్థిక బాధలు ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. యనమలకుదురులో ఏడేళ్ల కుమారుడికి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు గ్రామంలోని వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్డులో వేమిరెడ్డి భవాని ఆమె భర్త సాయిప్రకాష్‌రెడ్డి, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు.
భవాని విజయవాడ గాంధీనగర్‌లో జన ఔషధి మెడికల్ షాపులో పని చేస్తోంది. భర్త సాయిప్రకాష్‌రెడ్డి వన్‌టౌన్‌లో బంగారం వర్క్ షాపు నిర్వహిస్తాడు. కరోనా సమయంలో వ్యాపారం లేక భర్త సాయిప్రకాష్‌రెడ్డి అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. భర్త మానసికంగా ఇబ్బందులు పడుతుండటంతో భార్య అతనికి ధైర్యం చెప్పసాగింది. ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం భర్త పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు. భవాని తాను మెడికల్ షాపునకు వెళ్లి వస్తానని విజయవాడ వెళ్లింది. వెళ్లిన అరగంటలోనే భవానికి ఇంటి సమీపంలో ఉన్న వారు ఫోన్ చేసి ఆమె భర్త సాయిప్రకాష్‌రెడ్డి (34), కుమారుడు తక్షిల్ (7) విష పదార్థం తీసుకున్నారని చెప్పారు. వారిని పటమటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. భవాని పటమట ఆస్పత్రికి చేరుకుని వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య చికిత్సకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న తండ్రి, కొడుకు అదే రోజు రాత్రి మృతి చెందారు. సాయిప్రకాష్‌రెడ్డి చనిపోక ముందు తాను, కుమారుడు సైనేడ్ తీసుకున్నామని విజయ్ అనే మిత్రుడికి ఫోన్ వాయిస్ మెసేజ్ చేశాడు. మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్థిక బాధల కారణంగానే ఘటన

కుమారుడికి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య