
అంతా.. గప్‌చుప్
● విజయవాడ కేంద్రంగా యానిమేషన్ స్కాం.. బాధితుల్లో నరసరావుపేట వాసులే అధికం ● ఒక్కొక్కరి వద్ద రూ.కోట్లు వసూలు చేసిన స్కామర్ కిరణ్ ● కనీసం కార్యాలయ సీల్, అడ్రస్ కూడా లేకుండా అగ్రిమెంట్ కాగితాలు జారీ ● న్యాయపరంగా వెళ్లాలంటే చెల్లవేమోనన్న భయం ● పెట్టుబడి పెట్టింది బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదుకు అవకాశం లేదంటూ వాపోతున్న వైనం ● అధిక వడ్డీల ఆశతో గుల్లవుతున్న ప్రజలు
సాక్షి, నరసరావుపేట / నరసరావుపేట టౌన్: సాధారణంగా రూ.వెయ్యి పోతే.. పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీసి ఫిర్యాదు చేస్తాం. దొంగతనం చేసింది ఎవరో తెలిస్తే వెంటనే అతన్ని పట్టుకొని నగదు రికవరీకి ప్రయత్నిస్తాం. అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.400 కోట్లకు పైగా మోసం చేసిన వాడు ఎవడో తెలుసు.. అయినా ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు అందడం లేదు. బాధితుల సంఖ్య సుమారు వందల్లో ఉన్నా ఒక్కరూ ముందుకు రాకపోతే తామేమి చేయలేమని పోలీసులు చేతులెత్తుస్తున్నారు. ఇది యానిమేషన్ స్కాం ఉదంతంలో బాధితులు తీరు. విజయవాడ కేంద్రంగా యానిమేషన్ ప్రోగ్రామింగ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన కిరణ్ ఆర్థిక నేరానికి తెర తీశాడు. రాష్ట్రవ్యాప్తంగా రూ.వందల కోట్ల వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఇతని బాధితుల్లో నరసరావుపేట వాసులు అధికంగా ఉన్నారు. పెట్టిన పెట్టుబడికి అధిక శాతం వడ్డీ ఆశ చూపడంతో అనేకమంది స్తోమతకు మించి అప్పులు చేసి మరీ భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం కిరణ్ మోసం చేసి పరారవడంతో బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
సీల్ కూడా లేని అగ్రిమెంట్ కాపీలు...
రూ.లక్ష పెట్టుబడి పెట్టే సమయంలో సైతం ఇరువర్గాల మధ్య జరిగే అగ్రిమెంట్లు చాలా పక్కాగా ఉండేలా చూస్తారు. అలాంటిది పదుల కోట్ల రూపాయాలను యానిమేషన్ కంపెనీలో పెట్టుబడి పెట్టినా సరైనా పత్రం బాధితుల వద్ద ఒక్కటీ లేదంటే స్కాం ఎంత పక్కాగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కంపెనీ పేరుతో పెట్టుబడిదారులకు జారీ చేసిన ఒప్పంద పత్రాలలో ఎక్కడా కంపెనీ పర్మినెంట్ అడ్రస్ లేదు. విజయవాడలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయాన్ని నెల రోజుల క్రితం ఖాళీ చేయడంతో బాధితులకు ఎక్కడికిపోవాలో కూడా పాలుపోవడం లేదు. మరోవైపు అగ్రిమెంట్ కాపీలో పెట్టుబడులు స్వీకరించే కంపెనీ సీలు ఉండటం రివాజు. అయితే యానిమేషన్ కంపెనీ జారీ చేసిన అగ్రిమెంట్లలో ‘ఓకే’ అన్న అక్షరాలతో మాత్రమే సీల్ వేసి స్కామర్ కిరణ్ సంతకం చేసిన పత్రాలను జారీ చేశారు. రూ.వందల కోట్ల విలువైన కంపెనీకి సీల్ కూడా లేకపోవడం ఏంటని ప్రశ్నించలేదంటే బాధితులు అధిక వడ్డీలకు ఆశపడి ఎలా మోసపోయారో అర్థమవుతోంది.
స్పందించని ప్రభుత్వం
రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోటు ఆర్థిక నేరాలు వెలుగుచూస్తున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాఽధితులకు న్యాయం చేయకపోగా నిందితులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఇటీవల సాయిసాధన చిట్‌ఫండ్ స్కాం బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.