
చికిత్స పొందుతున్న సూర్యకాంతం
రణస్థలం: ఇద్దరు ఉపాధి హామీ పథకం వేతనదారులు పాముకాటుకు గురయ్యారు. ఈ సంఘటన మండలంలోని వెంకటరావుపేట, నెలివాడ గ్రామాల్లో బుధవారం చోటుచేసుకుంది. ఎన్‌ఆర్‌జీఎస్ ఏపీవో ఎం.శ్రీనివాసనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావుపేట గ్రామంలో కొత్తకోట్ల లక్ష్మి చెరువులో పని చేస్తుండగా పాము కాటుకు గురికావడంతో హుటాహుటీనా రణస్థలం సామాజిక ఆరోగ్య కేంద్రం తరలించి చికిత్స అందించారు.
అలాగే నెలివాడలో చెరువు పనులు చేస్తుండగా నౌకట్ల సూర్యకాంతం పాము కాటుకు గురికావడంతో ఆమెను కూడా సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందజేశామని చెప్పారు. ప్రమాదకరమైన విషసర్పాలు కాకపోవడంతో ఎటువంటి ప్రాణహాని లేదని చెప్పారు. మహిళలిద్దరిని 24 గంటల ప్రత్యేక పరిశీలనలో ఉంచుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.వి.ప్రసాద్‌రావు తెలిపారు. ఇద్దరూ కోలుకుంటున్నారన్నారు. వేతనదారులను ఎంపీడీవో వి.ధనుంజయరావు పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.