కొరాపుట్: అధికార పార్టీ బీజూ జనతాదల్‌కు చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే, జిల్లా ప్రణాళికా సంఘం అధ్యక్షుడు రఘురాం పొడాల్‌పై కోడి గుడ్లతో దాడి జరిగింది. ఈ నేపథ్యంలోకొరాపుట్ జిల్లా లమతాపుట్ సమితి కేంద్రంలో వివాదం చెలరేగాయి. లమతాపుట్‌లో ప్రభుత్వం నూతనంగా పంచాయతీ భవనం నిర్మించింది. దీనికి సంబంధించి ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరు కానున్నారు.
ఈ మేరకు భవన శిలాఫలకంపై ఎమ్మెల్యే, కలెక్టర్ పేర్లు ఉన్నాయి. అయితే విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక జిల్లా పరిషత్ సభ్యుల పేర్లు లేవు. దీనిని గమనించిన ఆ పార్టీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. దీనిపై అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇంతలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే రఘురాం భవనం ప్రారంభించేందుకు కారులో వచ్చారు. అప్పటికే ఆగ్రహావేశాలతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు.. మార్కెట్ మీదుగా ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తుండగా కోడి గుడ్లతో దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోగా పరారయ్యారు. అయితే యథావిధిగా కార్యక్రమ వేదిక వద్దకు చేరుకున్న రఘురాం పొడాల్.. భవనాన్ని ప్రారంభించారు. ఈ ఘటన అనంతరం మరో కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment