కొందమాల్‌లో చత్తీస్‌గఢ్ మావోల శిక్షణ శిబిరం (ఫైల్)
బరంపురం : కొందమాల్‌పై ఎప్పుడో పట్టు కోల్పోయిన మావోయిస్టులు మళ్లీ అదే స్థలానికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరు చాప కింద నీరులా కొత్త దళాలను ఏర్పాటు చేస్తున్నారా? కొందమాల్–కొలాహండి–గంజాం జిల్లాల సరిహద్దులను కారిడార్‌గా చేసుకొని కొందమాల్‌లో తిష్ట వేశారా? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల కిందట కొందమాల్ జిల్లా పిరింగియా పోలీసు స్టేషన్ పరిధిలో గల కొమనకుల పంచాయతీ, కొంబలోడు గ్రామం దగ్గర పోడుకొట్ట ఘాటీ ప్రాంతంలో మావోల డంప్ బయట పడడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
కేకేబీఎన్ దళం మావోయిస్టుల డంపు బయటపడటంతో చత్తీస్‌గఢ్ నాయకులు కొన్ని అనుబంధ సంస్థలతో కలిసి కొందమాల్–కలాహండి జిల్లాలను కలుపుకుని కొత్త దళం ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పిరింగియా పోలీసు స్టేషన్ పరిధిలో గల కొమనకుల పంచాయతీ, కొంబలోడు గ్రామం దగ్గర పోడుకొట్ట ఘాటీ దట్టమైన అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఎస్‌ఓజీ జవాన్లు కూంబింగ్ చేస్తుండగా మావోల డంప్ దొరికిందని దక్షిణాంచల్ ఐజీ సత్యబ్రత బోయి తెలియజేశారు.
ముమ్మరంగా కూంబింగ్
కొందమాల్ ఏఎస్పీ మినతి మిశ్రా, బౌద్ జిల్లా ఎస్పీ బి.గంగధర్, గంజాం జిల్లాకి చెందిన జగ్‌మోహన్ మీనాలు ఈ ఘటనపై అప్రమత్తమయ్యారు. కొందమాల్–కొలాహండి–గంజాం జిల్లాల సరిహద్దుల్లోని బల్లిగుడా, రైకియా, బమ్ముణిగామ్, దరింగబడి, గజలబడి, కటింగియా, పాణిగొండా అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment