No Headline
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక పర్యాటకుడిని బుధవారం పూరీ సముద్రం స్వర్గ ద్వారం తీరంలో స్నానం చేస్తుండగా కెరటాలు ఈడ్చుకుపోయాయి. తీరం చేర్చి ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రి వైద్య వర్గాలు ప్రకటించాయి. మృతుడు పశ్చిమ బెంగాల్ బంకురాలోని నిత్యానందపూర్‌కు చెందిన సుశాంత్ అధికారి (54)గా గుర్తించారు.
విచారణకు కమిటీ..
భువనేశ్వర్: గతంలో బిజూ జనతా దళ్ ప్రభుత్వం ఒడిశా రాష్ట్ర ఆహార కమిషన్ చైర్‌పర్సన్‌ను నియమించింది. ఈ నియామకం పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆహార సరఫరాలు మరియు వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో బుధవారం ప్రకటించారు. నియామక ప్రక్రియ సరికాదని తేలితే సంబంధిత వ్యక్తిని ఒడిశా రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు.
బంగారం దుకాణంలో చోరీ..
కొరాపుట్: బ్రహ్మపుర నగరంలోని బంగారు దుకాణంలో చోరీ జరిగింది. బైద్యనాథ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జనని ఆస్పత్రి రోడ్డులో ఉన్న ఓం శ్రీ జ్యూయలర్స్‌లో దొంగలు పడ్డారు. ఉదయం షాపు తెరవడానికి యజమాని జమ్మల శ్రీధర్ వెళ్లినప్పుడు దొంగతనం జరిగినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విలువైన బంగారు వస్తువులను స్ట్రాంగ్ సేఫ్ లాకరులో ఉంచడంతో దానిని తెరవడానికి గ్యాస్ కట్టర్లు ద్వారా దొంగ ప్రయత్నం చేసి విఫలం అయ్యాడు. అయితే బయట ఉన్న కొన్ని బంగారు నగలు, సుమారు 20 కేజీల వెండి పట్టుకుపోయాడు.
పట్టుబడిన టేకు కలప..
పర్లాకిమిడి: గంజాం జిల్లా దక్షిణ ఘుమసుర అటవీ శాఖ పరిధి అస్కా రేంజ్‌లో నువాభావనపూర్ జంక్షన్ వద్ద బుధవారం అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలతో సహా డ్రైవర్‌ను అరెస్టు చేశారు. వాహనంలో పట్టుకున్న కలప దుంగలు 57 ఘన చదరపు అడుగులు ఉన్నవి.
వెయిట్ లిఫ్టింగ్ పోటీలు..
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలో ఉన్న స్టేడియంలో తొలిసారిగా వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో బాలికల విభాగంలో ప్రథమ స్థానంలో మనీష మొహంతి, రెండో స్థానంలో సిప్రా, మూడో స్థానంలో ఉషా శర్మలు, పురుషుల విభాగంలో ఆలీ సర్ధార్, బిజేంద్ర బిహారీ, రంజాన్ సాహులు తొలి మూడు స్థానాల్లో నిలిచారు.
ఆశ్రమ పాఠశాల సందర్శన..
జయపురం: కుంద్ర సమితి అసన గ్రామ పంచాయతీ ఉదల్‌గుడ గ్రామంలోని కేడీఎఫ్ ఆశ్రమ పాఠశాలను జయపురం సబ్ కలెక్టర్ ప్రభాత్ కుమార్ పొరిడా సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో విషాహారం తినడం వలన 69 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వీరిలో నలుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జయపురం జిల్లా కేంద్రా ఆస్పత్రికి బుధవారం తరలించారు. దీంతో ఆయన హాస్టల్‌ను సందర్శించి పరిశుభ్రత, సౌకర్యాలను పరిశీలించారు. విషాహారంపై సంబంధిత అధికారులతో చర్చించారు.
రాయగడలో డీఆర్‌ఎం పర్యటన..
రాయగడ: విశాఖపట్నం రైల్వే డివిజన్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్ బుధవారం రాయగడలో పర్యటించారు. విజయనగరం నుంచి రాయగడ వరకు కొనసాగుతున్న మూడో రైల్వేలైన్ నిర్మాణం పనులను సమీక్షించారు. అనంతరం రన్నింగ్ రూమ్, కొత్తగా నిర్మించిన స్టేషన్ బిల్డింగ్‌ను పరిశీలించారు. ఆయన వెంట రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.
సత్తాచాటిన జయపురం ఆటగాళ్లు..
జయపురం: కొరాపుట్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీల్లో జయపురం ఆటగాళ్లు సత్తాచాటారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో గెలిపొందిన వారికి బహుమతులు అందజేశారు.
దరఖాస్తుల స్వీకరణ..
రాయగడ: రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కొత్తగా అమలు చేసిన సుభద్ర పథకం దరఖాస్తుల పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రాయగడలో ప్రారంభమయ్యింది. మహిళలు తమ దరఖాస్తులను సమర్పించేందుకు పెద్ద సంఖ్యతో హాజరవుతున్నారు. దీంతొ అంగన్‌వాడీ కేంద్రాలు మహిళలతో రద్దీగా ఉన్నాయి.
వెబ్ పోర్టల్ మెరాయింపు..
పర్లాకిమిడి: పట్టణంలో బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన సుభద్ర పథకం పోర్టల్ మొరాయించింది. దీంతో అప్లయ్ చేసుకోవడానికి వచ్చిన మహిళలు నిరాసతో వెనుదిరిగారు. కాగా సుభద్ర ఫారాలను కొందరూ డబ్బులకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment