సాక్ష్యం చెబుతాడని ప్రాణం తీశారు
పర్లాకిమిడి: మాజీ వార్డు మెంబరు తిరిసింగి ముఠామఝి హత్య కేసును అడవ పోలీసులు ఛేదించారు. ఇందులో ప్రమేయమున్న నలుగురు నిందితులును అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా బుధవారం రాణిపేట డి.పి.ఓ.కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. మోహానా బ్లాక్ అడవ పి.ఎస్.పరిధి కటమా వాటర్ ట్యాంకు వద్ద ఈ నెల 3న ఉదయం పాణిగండ గ్రామం నుంచి వస్తున్న తిరిసింగి ముఠామఝిని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పదునైన టంగియా, రాయితో కొట్టి చంపారు. మృతుడి భార్య చబితా ముఠామఝి (తువ్వాబడి గ్రామం) అడవ పోలీసు ష్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. డీఎస్పీ అమితాబ్ పండా, అడవ ఐఐసీ, సుభ్రాంత్ పండా కేసు దర్యాప్తుచేశారు. ముఠా మఝి, సురేష్ మఝి మధ్య పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు గుర్తించారు. కేసుకు సంబంధించి సురేష్ మఝి (జడింగి), శ్యాంసన్ మల్లిక్ (కంధమాల్), మనోజ్ మఝి(పజిగుడి), బిశ్వరంజన్ ఉత్తాన సింగ్(తువ్వాబడి)లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సురేష్ మఝి సోదరుడు, మాజీ మావోయిస్టు ఎ.కె.47తో ఒకర్ని కాల్చినపుడు మృతుడు ముఠామఝి సాక్షిగా ఉన్నాడు. 2021లో జరిగిన ఈ కేసులో సురేష్ మఝి సోదరుడు అరెస్టయ్యాడు. ఇప్పుడు తుది విచారణలో ఉండగా ముఠా మఝి కోర్టులో సాక్ష్యం ఇవ్వనున్నాడని తెలిసి నిందితులు ఈ హత్యకు పాల్పడ్డారు. నిందితుల వద్ద నుంచి బైక్, ఐదు సెల్‌ఫోన్లు, మూడు వేటకత్తులు (టంగియా) స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ పండా తెలిపారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ అమితాబ్ పండా, అడవ పోలీసులు పాల్గొన్నారు.
తిరిసింగి ముఠామఝి హత్యకేసును ఛేదించిన పోలీసులు
నలుగురు నిందితుల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment