తాత్కాలిక వంతెన నిర్మాణం అడ్డగింత
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి బొదాపుట్ గ్రామ పంచాయతీ కబరగుడ గ్రామ సమీప నదిపై నిర్మిస్తున్న తాత్కాలిక వంతెన పనులను స్థానికులు అడ్డుకున్నారు. తకాల–మాది గ్రామాలను కలుపుతూ రోడ్డు ఉందని, దారిలో నది ఉందని తెలిపారు. వానాకాలంలో నది ఉద్ధృతంగా ప్రవహించి కబరగుడకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని చెప్పారు. వానాకాలంలో రోగులను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేకపోతున్నామని, నదికి ఆవల వైపునే శ్మశానం కూడా ఉందని, వానాకాలంలో దహన సంస్కారాలు కూడా జరగడం లేదని పేర్కొన్నారు. ఇంత కష్టకాలంలో ఉంటే నదిపై కేవలం నాలుగు అడుగుల హ్యూమ్ పైపులు వేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాత్కాలిక వంతెన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నామని, శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. పనులను అడ్డుకున్న వారిలో బొదాపుట్ పంచాయితీ సర్పంచ్ కృష్ణ భొత్ర,సుందర గదబ,జొగ గదబ,బుధ్ర గదబ,భగవాన్ శిశ, జగబందు గదబ,లెరి గదబ తదతరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment