భువనేశ్వర్: రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు బీఎస్‌ఈ ఆధ్వర్యంలో పదో తరగతి (మెట్రిక్యులేషన్) వార్షిక పరీక్షలు గురువారంతో ముగిశాయి. త్వరలో జవాబు పత్రాలు దిద్దే మూల్యాంకనం ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నారు. అంచెలంచెలుగా ఒక్కో ప్రక్రియ ముగించి మే నెల మొదటి వారంలో పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నట్లు బీఎస్‌ఈ అధ్యక్షుడు శ్రీకాంత్ తొరాయ్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,133 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా పూర్తయ్యాయి. ఈ నెల 19 నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలిపారు. మెట్రిక్యులేషన్ ఫలితాలను మే నెల మొదటి వారంలో ప్రకటిస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అనివార్య పరిస్థితుల కారణంగా ఎలాంటి అవాంతరం తలెత్తకుంటే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఫలితాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సహకరించిన అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, పోలీసు దళాలు, మీడియా వ్యక్తులకు అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు.
చర్యలు ఫలప్రదం
ఈ ఏడాది పరీక్షల నిర్వహణ పురస్కరించుకుని ప్రశ్న ప్రతాల లీకేజి అరికట్టేందుకు కట్టుదిట్టంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో బార్ కోడ్‌లు, ఎన్‌క్రిప్టెడ్ సెక్యూరిటీ నంబర్లు, వాటర్‌మార్క్‌లతో సహా బోర్డు తీసుకున్న వివిధ భద్రతా చర్యలు లీకేజీలు, ఇతర అంతరాయాలను నివారించడంలో విజయవంతమయ్యాయని ఆయన పేర్కొన్నారు. బోర్డు లైవ్ ఫీడ్ ద్వారా పరీక్షా కేంద్రాల కార్యకలాపాలను పర్యవేక్షించే విస్తృతమైన సెంట్రల్ కమాండ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సంవత్సరం నిర్వహించిన మెట్రిక్యులేషన్ పరీక్షలకు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మాధ్యమ, స్టేట్ ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు కూడా ఉన్నారు. రాష్ట్రం అంతటా 3,133 కేంద్రాలలో నిత్యం ఉదయం 9 గంటల నుండి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు జరిగాయి.
మే నెల మొదటి వారంలో ఫలితాలు
త్వరలో మూల్యాంకనం
Comments
Please login to add a commentAdd a comment