పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి
విజయనగరం అర్బన్: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. దీనికి సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పది ఆపై తరగతులు ఉత్తీర్ణులైన వారంతా ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 550 పరిశ్రమల్లో వీరికి శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టరేట్ చాంబర్లో శనివారం జరిగింది. ముందుగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ యువత నైపుణ్యాన్ని పెంచేందుకు, ఉపాధి కల్పించేందుకు జిల్లాలో తీసుకున్న చర్యలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువత నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఎ.కళ్యాణ చక్రవర్తి, సీపీఓ పి.బాలాజీ, మెప్మా పీడీ చిట్టిరాజు, జిల్లా ఉపాధి అధికారి అరుణ తదితర అధికారులు పాల్గొన్నారు.
పనస చెట్లను విరివిగా పెంచాలి
బొబ్బిలి వీణల తయారీకి ఉపయోగించే పనస కలప కొరత ఉందని, దీనిని నివారించేందుకు విస్తృతంగా పనస చెట్లను పెంచాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. పనస నర్సరీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే అటవీ శాఖకు ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ, కన్వర్జెన్నీ పనులు, పల్లె పండగ, ఉల్లాస్ పరీక్ష తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఏపీఓలు, పీఆర్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫారమ్ పాండ్స్ తవ్వడానికి జిల్లాలో శనివారం నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి డ్వా మా పీడీ ఎస్.శారదాదేవి, పంచాయితీరాజ్ ఎస్‌ఈ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్