
ఝివురీ అడ్డగింతపై ఆందోళన
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి చత్తీస్‌గఢ్ సరిహద్దున గల ఝివురి నది ముందు అడ్డంగా వేసిన ఇసుక బస్తాలు వెంటనే తొలగించాలని బీజేడీ శ్రేణులు చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వందలాది మంది కార్యకర్తలు, బిజేడి నాయకులు ఆదివారం ఝివురి నదీ ప్రాంతాన్ని సందర్శించారు. 2003లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడం తగదని అన్నారు. మాజీ మంత్రి పద్మిని దియాన్ అధ్యక్షతన నిర్వహించిన ఝివురి బచావ్ అభిజాన్ సభలో మాజీ మంత్రి రబినారాయణ నందో మాట్లాడుతూ ఝివురి నది నుంచి నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, అలా చేస్తే కొరాపుట్ ప్రజలు మౌనంగా ఉండబోరని అన్నారు. గతంలో ఉభయ ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాన్ని పక్క రాష్ట్రం ఉల్లంఘిస్తోందని అన్నారు. ఇసుక బస్తాలు తొలగించేంత వరకు బీజేడీ పోరాడుతుందని స్పష్టం చేశారు. సభలో కొట్‌పాడ్ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర మఝి, జిల్లా పరిషత్ సభ్యులు త్రిపతి చలాన్, కొట్‌పాడ్ సమితి ఉపాధ్యక్షుడు బాబులి పాణిగ్రహి, కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వరచంద్ర పాణిగ్రహి, ఉపాధ్యక్షుడు దురుపుత భొత్ర, సీనియర్ బీజేడీ నేతలు పద్మన్ బిశాయి, మహమ్మద్ సలీమ్, లక్ష్మీపూర్ మాజీ ఎమ్మెల్యే ప్రభుజానితో పాటు వందలాది మంది స్థానిక బీజేడీ కార్యకర్తలు పాల్గొన్నారు.