
‘ప్రసాద్’ నిధుల కోసం ప్రయత్నాలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అభివృద్ధి పనుల కోసం ఇంకా ఎలాంటి ఫాలోఅప్ చేయకపోవడంపై తనకు అసంతృప్తిగా ఉందని రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కుటుంబసమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈవో వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించామని, ఇందుకోసం ఆలయం ముందర నిర్మాణాలన్నీ యుద్ధ ప్రాతిపదికన కూల్చివేసి.. అద్భుతంగా అభివృద్ది పనులు చేపట్టాలని భావించామని, తర్వాత ఫాలో అప్ సరిగ్గా లేకపోవడంతో పనులు ప్రారంభించలేకపోయామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ స్కీం మంజూరు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని.. ఆ నిధులు వచ్చేవరకు భక్తులకు తాత్కాలిరంగా సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, మంత్రి సోదరుడు హరిప్రసాద్, టీడీపీ ఇన్‌చార్జిలు తెలుగు నాగరత్నం, ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు.