నిరసనల ఘాటు..
● 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెండ్ ● వారం రోజుల పాటు కొనసాగనున్న ఆదేశాలు ● క్రమశిక్షణ ఉల్లంఘించడంపై చర్యలు: స్పీకర్ సురమా పాఢీ
భువనేశ్వర్:
శాసనసభలో అనుచిత ప్రవర్తన ఆరోపణ కింద కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. స్పీకర్ సురమా పాఢి ఆదేశాల మేరకు 12 మంది కాంగ్రెస్ సభ్యులను సభా కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు మంగళవారం ప్రకటించారు. ఈ ఆదేశాలు వారం రోజుల పాటు నిరవధికంగా అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. సభలో బడ్జెటు సమావేశాల కార్యకలాపాల సమయంలో పదేపదే అంతరాయం ఏర్పరచి క్రమశిక్షణను ఉల్లంఘించడంతో ఈ చర్య అనివార్యమైనట్లు స్పీకర్ పేర్కొన్నారు. అధికార పక్షం చీఫ్ విప్ ప్రతిపాదన మేరకు చర్యలు తీసుకున్నారు.
కాంగ్రెస్ సభ్యుల నిరసన
సస్పెన్షన్ చర్యకు నిరసనగా శాసనసభ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. ఘంటానాథం, తాళాల మోత, వేణు గానం తదితర వాద్యాలతో తమ నిరసనలు వ్యక్తం చేశారు. శాసనసభలో 14 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. వీరిలో 12 మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిలో కాంగ్రెస్ శాసన సభా నాయకుడు రామచంద్ర కదం, అశోక్ కుమార్ దాస్, సత్యజిత్ గొమాంగో, పబిత్ర సంవుట, సాగర్ చరణ్ దాస్, నీల మాధబ్ హికాకా, ప్రఫుల్ల చంద్ర ప్రధాన్, సోఫియా ఫిరదౌస్, డాక్టర్ సి.ఎస్.రాజెన్ ఎక్కా, మంగు ఖిల్లా, దాశరథి గొమాంగో, కద్రక అప్పల స్వామి ఉన్నారు. కాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తారా ప్రసాద్ బాహిణీపతి మరియు రమేష్ జెనాలు ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే.
మహిళల భద్రతపై ఆందోళన
రాష్ట్రంలో మహిళల భద్రతపై కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో గత కొన్ని రోజులుగా ఆందోళన తెలుపుతున్నారు. మహిళల భద్రత స్థితిగతుల దృష్ట్యా సభా కమిటీ ఏర్పాటు చేసి సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సభలో బడ్జెట్ సమావేశాలు ఆరంభం నుంచి ఇదే కొనసాగుతోంది. తమ డిమాండ్ మేరకు మహిళల భద్రతపై సభా కమిటీ ఏర్పాటు చేయనంతవరకు నిరసన నిరవధికంగా కొనసాగిస్తామని బాహాటంగా కాంగ్రెస్ సభ్యులు ప్రకటించారు. ఈ ప్రకటన జారీ చేసిన స్వల్ప వ్యవధిలో సభ నుంచి 12 మంది సభ్యులను సస్పెండ్ చేసినట్లు స్పీకర్ నిర్ణయం ప్రకటించడం రాజకీయ శిబిరాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.
సస్పెన్షన్ దురదృష్టకరం
సభలో కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ దురదృష్టకరమని కాంగ్రెస్ ఎమ్మెల్యే దాశరథి గొమాంగో అన్నారు. స్పీకర్‌పై తాము సముచిత గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సభను సమర్ధవంతంగా నడపలేకపోతోందని ఆరోపించారు. మహిళల భద్రత అంశంపై సభా కమిటీ ఏర్పాటు డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని, రానున్న రోజుల్లో ఆందోళనను మరింత తీవ్రతరం చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా మహిళల భద్రతపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్ ప్రకారం అధికార పార్టీ అంగీకరించి సభా కమిటీని ఏర్పాటు చేసి ఉండాల్సిందని బీజేడీ ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్ సాహూ ఏకీభవించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఇదంతా జరిగిందని విచారం వ్యక్తం చేశారు. 12 మంది ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు చర్యగా పేర్కొన్నారు. గత 10 రోజులుగా సభలో కొనసాగుతున్న పరిస్థితులను సమర్దవంతంగా పరిష్కరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే శాసన సభలో సమావేశాలు పురస్కరించుకుని ప్రభుత్వం రోజుకు సగటున రూ.70 లక్షలు వెచ్చిస్తోందని అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే బాబు సింగ్ తెలిపారు. ప్రతిపక్షాలు కీలకమైన చర్చలను అడ్డుకొని అమూల్యమైన సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
విస్తృతంగా చర్చ
ఒక వైపు శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుల నిరంతర అంతరాయం, మరోవైపు అధికార పక్షం ఏకపక్షంగా 12 మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడంపై మేధావుల వర్గంలో చర్చలు జోరందుకున్నాయి. సమావేశాలు పురస్కరించుకుని ప్రజల అవసరాలు, సమస్యలపై నిర్మాణాత్మక సంభాషణలు, ప్రశ్నోత్తరాలు, చర్చలు కొనసాగించే పరిస్థితులు దాదాపు కనుమరుగైపోవడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది.
బీజేడీ శాంతియుత నిరసన
మహిళల భద్రత అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన తారస్థాయికి చేరుకుంది. అయితే ఇదే శీర్షికతో ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ హుందాగా నిరసన తెలిపింది. మంగళవారం సమావేశ హాలు ప్రధాన ప్రవేశ మార్గం ఆవరణలో ప్లకార్డులతో బైఠాయించి శాంతియుతంగా నిరసన ప్రదర్శించింది. అదేవిధంగా సభలో తాజా స్థితిగతులపై విపక్ష బిజూ జనతా దళ్ సభ్యురాలు ప్రమీల మల్లిక్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కాంగ్రెస్ సభ్యులపై తీసుకున్న చర్య ఆమోదయోగ్యం కాదని ఆమె తేటతెల్లం చేశారు. ఈ పరిస్థితిపై సీఎం మోహన్‌చరణ్ స్పందించాలని కోరారు. 12 మంది సభ్యులను సస్పెండ్ చేసే ముందు విపక్షాలతో చర్చించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.