పరీక్షలంటే భయాన్ని వీడండి
సాలూరు: విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని విడనాడాలని సబ్‌కలెక్టర్, ఇన్‌చార్జ్ ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పాచిపెంట మండలంలోని పి.కోనవలస గిరిజన గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని రుచి చూసి మెనూ పరిశీలించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలు ఏ విధంగా రాస్తున్నారు? ఏ విధమైన ప్రణాళిక ద్వారా చదువుతున్నారు? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యంతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. పరీక్షల్లో ప్రణాళికా బద్ధంగా చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ