రాయగడ: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని బొబ్బిలిలో ఉన్న మహేశ్వరి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కోడిరామ్మూర్తి కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంస్థల యజమాని రంబా చంద్రశేఖర్, సుగుణ దంపతులు మజ్జిగౌరి అమ్మవారికి ఇత్తడితో రూపొందించిన రెండు సింహాలమూర్తులను వితరణగా బుధవారం అందజేశారు. 300 కిలోల బరువు ఉన్న ఇత్తడితో రూపొందించిన ఈ సింహాలను అమ్మవారి ప్రవేశ ద్వారం ముందు ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు దాతలు బుధవారం ప్రత్యేక పూజలను అమ్మవారి మందిరం ప్రాంగణంలో నిర్వహించారు. కాగా ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమ్మవారి చైత్రోత్సవాల ప్రారంభ సమయంలో ఇత్తడి సింహాలను ప్రాణ ప్రతిష్టించిన అనంతరం, వాటిని ఏర్పాటు చేస్తామని ట్రస్టు సభ్యులు తెలియజేశారు.