కదంతొక్కిన బీజేడీ
భువనేశ్వర్: రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, విపక్షాల ఆవేదనని అణచివేస్తూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందిని ఆరోపించింది. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న విపక్ష సభ్యులపై అరాచకత్వం ప్రదర్శిస్తోందని మండిపడింది. రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా మాదిరిగానే ఏదో యుద్ధం జరుగుతోందన్నట్లుగా సభలో నిరసన ప్రదర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొట్టారని బీజేడీ సభ్యుడు డాక్టర్ అరుణ్ కుమార్ సాహూ పరిస్థితిని అంతర్జాతీయ సంఘర్షణలతో పోల్చారు. పోలీసులు బీజేడీ ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారని మండిపడ్డారు. 14 మంది సభ్యుల సస్పెన్షన్‌పై స్పీకర్ వైఖరి సభలో స్పష్టం చేయాలని బీజేడీ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై స్పీకర్ వైఖరి కొరవడడంతో బీజేడీ శాసన సభ్యులంతా శాసనసభ నుంచి బయటకు వచ్చేశారు.
స్పీకర్ ప్రకటన
అనంతరం బీజేడీ సభ్యుల ఆందోళన మేరకు సభలో స్పీకర్ సురమా పాఢి వివరణ ప్రవేశపెట్టారు. ఈనెల 25వ తేదీ వరకు 12 పని రోజులు పాటు జరిగిన మలి విడత బడ్జెటు సమావేశాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. ఈ నిడివిలో సమగ్రంగా రాష్ట్ర శాసనసభ కార్యకలాపాల్లో 39 గంటల 2 నిమిషాల పాటు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. సభలో సభ్యుల తీరుని చక్కదిద్దేం
దుకు పలుమార్లు అఖిల పక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది అన్నారు. దీనిలో భాగంగా ఈనెల 10, 13, 24, 25 తేదీల్లో వరుసగా అఖిల పక్ష సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఈనెల 21న డిప్యూటీ స్పీకర్ సభలో సభ్యులు మర్యాదపూర్వకంగా మెసులుకోవాలని అభ్యర్థించారని వెల్లడించారు. ఈ అభ్యర్థనపై నిర్లక్ష్యం ప్రదర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలకు అంతరాయం నిరవధికంగా కొనసాగించారు. దీని ఫలితంగా మంగళవారం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. అయితే వారు అసెంబ్లీ ప్రాంగణాన్ని వదిలి వెళ్లడానికి నిరాకరించి రాత్రంతా ప్రదర్శన నిర్వహించారని తెలిపారు. దీంతో శాసన సభ్యులకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి 9 గంటలకు కాంగ్రెస్ సభ్యులు మరియు కార్యకర్తలు శాసనసభ ఆవరణలో మార్షల్స్, భద్రతా సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన సిబ్బందికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో సభలో కాంగ్రెసు సభ్యుల నిరసన హింసాత్మక రూపు దాల్చుకుంటున్న వైపరీత్యం దృష్ట్యా శాసనసభ మార్షల్ మరియు భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో సభ నుంచి బయటకు తొలగించారన్నారు. ముందస్తు ఆదేశాల మేరకు సిబ్బంది ఈ చర్యని చేపట్టినట్లు స్పీకర్ శాసనసభలో స్పష్టం చేశారు.