మట్టి మాఫియా ఆగడాలు
రామభద్రపురం: మండలంలో మట్టిమాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నాయకుల అండతో గ్రామాల్లోని చెరువులు, చెరువు పోరంబోకు, గెడ్డ పోరంబోకుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ చోటామోటా నాయకులు వారి జేబులు నింపుకుంటున్నారు. టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు ఉండడం, ఒక వేళ ఫిర్యాదు వచ్చినా నామమాత్రంగా పరిశీలించి మిన్నకుండిపోవడంతో మండలంలో మట్టి మాఫియా పేట్రేగిపోతూ అక్రమ రవాణా సాగిస్తోంది. ఎన్నడూలేని విధంగా రాత్రింబవళ్లు మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నా అటువైపు కన్నెత్తి చూసే సాహసాన్ని కూడా అధికార యంత్రాంగం చేయడం లేదు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే అటువైపు వెళ్తున్నారు తప్ప..అక్రమ రవాణాను అడ్డుకుందామన్న స్పృహ వారికి లేదని, ఒక వేళ అడ్డుకున్నా అధికార పార్టీ నాయకుల నుంచి ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే వెనుదిరుగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కొట్టక్కి రెవెన్యూ పరిధిలో రేయింబవళ్లు చెరువు పోరంబోకు, చెరువులు, గెడ్డ పోరంబోకులో జేసీబీలతో విలువైన మట్టిని తవ్వి వందలాది ట్రాక్టర్లు, పెద్దపెద్ద ట్రక్కులు, లారీల ద్వారా మన్యం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన మాఫియా అక్రమంగా తరలిస్తున్నారు. రామభద్రపురం నుంచి సాలూరు వెళ్లే ఎన్‌హెచ్ 26 రోడ్డు పక్కన ఉన్న సైట్‌లు ఎత్తు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులకు ఎంతోకొంత ముట్టజెప్పడంతో పాటు స్థానిక టీడీపీ నాయకుడు, సాలూరుకు చెందిన ఓ చౌదరికి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.150 వరకు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారం మనదే అడ్డుకునేవారే లేరంటూ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు సైతం అడ్డుకోవడానికి కూడా వీల్లేదంటూ చోటా నాయకులు హుకుం జారీ చేసి మరీ మట్టి తవ్వకాలు నిర్వహించడం గమనార్హం. అక్రమార్కులు మట్టి ఎక్కడికి తరలిస్తున్నారో తెలిసినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రకృతి సంపదను దోపిడీ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని గ్రామస్తులు ప్రత్యక్షంగా ఆందోళన చేసినా..లేక ఫిర్యాదు చేసినా అధికారులు అడపాదడపా దాడులు చేస్తూ మమ అన్పిస్తున్నారు తప్ప కట్టడి చేసే ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
యథేచ్చగా రవాణా
ప్రభుత్వ ఆదాయానికి గండి
అధికార పార్టీ నాయకుల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
చేతులెత్తేసిన రెవెన్యూ యంత్రాంగం
ఫిర్యాదు చేసినా స్పందన లేదు
మూడు రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వెళ్లి అడ్డుకుని, ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు స్వయంగా ఫిర్యాదు చేశాను. కనీస స్పందన లేదు. మొన్న జూనియర్ అసిటెంట్ వచ్చి అడ్డుకుని జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తుండగా ఎక్కడి నుంచో ఫోన్ రావడంతో వెంటనే వదిలేసి వెళ్లిపోయారు. మండలంలో ఇసుక, మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సంబంధిత అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే అటువైపు వెళ్తున్నారు కానీ అడ్డుకోవడం లేదు.
అలమండ ఆనందరావు, సీపీఐ జిల్లా జాయింట్ సెక్రటరీ, కొట్టక్కి
సిబ్బందిని పంపి అడ్డుకుంటాం..
మాకు ఫిర్యాదు అందింది. కానీ వారి సొంత భూమిలో తవ్వుకుని, వారి పొలంలోనే వేసుకుంటున్నామని చెబుతున్నారు. మా అధికార సిబ్బందిని పంపించగా వెళ్లి పరిశీలించారు. తవ్వడం వాస్తవమే. అయితే వారి సొంత పొలం తవ్వుకుని వేసుకుంటున్నారని చెబుతున్నారు. అయినా నిబంధనల ప్రకారం ఎక్కడ తవ్వినా అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. మరోసారి సిబ్బందిని పంపించి అక్రమ రవాణాను అడ్డుకుంటాం.
ఎ సులోచనరాణి, తహసీల్దార్, రామభద్రపురం
మట్టి మాఫియా ఆగడాలు
మట్టి మాఫియా ఆగడాలు
మట్టి మాఫియా ఆగడాలు
మట్టి మాఫియా ఆగడాలు