మద్యం మత్తులో నీటిలో పడి మహిళ మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి ఎంవీ 79 పోలీసుస్టేషన్ పరిధి తేల్‌రాయి పంచాయతీ సమీప గ్రామంలో మద్యం మత్తులో ఒక మహిళా నీటిలో పడి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ఇద్దరు తోటికోడళ్లు అయినటువంటి రామే మాడీ, బుచ్చి మాడీలు తమ పొలంలో ఉన్న ఇప్పచెట్టు పూల కోసం బుధవారం ఉదయం వెళ్లారు. వాటిని సేకరించి అమ్మిన తర్వాత ఇద్దరూ సాయంత్రం 4 గంటల సమయంలో మద్యం సేవించారు. అనంతరం డబ్బులు కోసం గొడవపడ్డారు. ఈ గోడవలో ఇద్దరూ చూసుకోకుండా సమీపంలో ఉన్న నీటి కాలువలో పడిపోయారు. దీంతో బుచ్చి(48) అక్కడిక్కక్కడే మృతి చెందింది. అయితే అటుగా వచ్చిన కొంతమంది రామేమాడీని రక్షించి వెంటనే కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఎస్‌ఐ చందన్ బెహర ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. కాగా చికిత్స పొందుతున్న రామేమాడి ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు తెలిపారు.
177 కేజీల గంజాయి స్వాధీనం
● కారు వదిలేసి పరార్
జయపురం: జయపురం సమితి గొడొపొదర్ సమీప రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద నిలిపి ఉన్న ఒక కారులో 177 కేజీల గంజాయి సదర్ పోలీసులకు బుధవారం రాత్రి చిక్కింది. పట్టుబడిన గంజాయి విలువ రూ.17 లక్షలకు పైనే ఉంటుందని గురువారం వెల్లడించారు. పోలీసు అధికారి ప్రదాన్ తెలిపిప వివరాల ప్రకారం.. జయపురం సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గగణాపూర్ పోలీసు పంటి అధికారి, సబ్ ఇన్‌స్పెక్టర్ రాజకిశోర్ బారిక్ నేతృత్వంలో పెట్రోలింగ్ నిర్వహించారు. గొడొపొదర్ మార్గంలో ఓ కారు నిలిచి ఉంది. కారులో ఎవరూ లేరు. కారు వద్ద గంజాయి వాసన రాగా అనుమానించిన పెట్రోలింగ్ పోలీసులు తనిఖీ చేశారు. కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిని మెజిస్ట్రేట్ సమక్షంలో గంజాయి తూకం వేయగా 177 కేజీలు ఉన్నట్లు తెలిపారు. పోలీసులను చూసి గంజాయి మాఫియా గ్యాంగ్ పరారై ఉంటారని పోలీసు అధికారి ప్రదాన్ వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రదాన్ తెలిపారు.
జీవామృతం తయారీపై అవగాహన
మల్కన్‌గిరి : జిల్లాలోని కలిమెల సమితి అటవీశాఖ సమావేశ మందిరంలో బుధవారం కలిమెల, మోటు అటవీశాఖ రక్షణ కమిటీ సభ్యులకు జీవామృతం వ్యవసాయంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వర్‌కు చెందిన గ్రామీణ ఉత్పత్తి వ్యాపార సంస్థ డైరెక్టర్ ప్రపుల్ల బిశ్వాయి మాట్లాడుతూ జీవామృతం తయారీపై అవగాహన కల్పించారు. స్వయం సహాయక సంఘ సభ్యులకు సూచనలు అందించారు. అనంతరం కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అటవీ అధికారి మృత్యుంజయ శెఠి, శ్రీనివాస్ పాత్రో, అభిమన్యు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరానికి స్పందన
జయపురం: తెలుగు సినీ నటుడు, గ్లోబల్ స్టార్ రామచరణ్ పుట్టినరోజు సందర్భంగా జయపురం గ్లోబల్ స్టార్ రామచరణ్ యువత గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 15 యూనిట్ల రక్తం సేకరించినట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వై.శ్రీనివాస ఖన్నా తెలిపారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జయపురం శాఖ ప్రెసిడెంట్ మల్లికార్జున నాయిక్, ఉపాధ్యక్షుడు జి.సతీష్, కార్యదర్శి అలోక్ కోశ్లా,సహాయ కార్యదర్శి కె.వినోద్ పాల్గొన్నారు.
మద్యం మత్తులో నీటిలో పడి మహిళ మృతి
మద్యం మత్తులో నీటిలో పడి మహిళ మృతి