
కొరాపుట్ జిల్లా మహిళా క్రికెట్ టీమ్ ఎంపిక
జయపురం: కొరాపుట్ జిల్లా మహిళా క్రికెట్ టీమ్‌ను ఆదివారం ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మహిళా క్రికెట్ క్రీడాకారులకు నిర్వహించిన పోటీలో 17 మందిని ఎంపిక చేశారు. ప్రియాంక వర్మ (కెప్టెన్), సొమరి హోంజరియ, నమ్రత్ ఎడ్డింగ్, సాలు బరోల్, సునీత ఖిలో, జానకి చలాన్, సుంబాల పర్విన్, డోళీ అంపొడియ, అమ్రిత డ్యుయెల్‌పొడియ, గంగా హంజారియ, సుదురుతి రౌత్, దిబ్యశ్రీ జెన, భవాన బర్మ, ప్రియాంక పాత్రో, జశ్వినీ మహంతిని ఎంపిక చేశామని జయపురం సబ్‌డివిజనల్ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి రబి నాయక్ వెల్లడించారు. గౌరీ ప్రధాని, గీతాంజలి రిషిలను స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మహిళా క్రీడాకారుల మద్య నిర్వహించిన పోటీలను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనూప్ కుమార్ పాత్రో, జి.ప్రసాద్, జి.సత్యనారాయణ నిర్వహించి, ఉత్తమ మహిళా క్రీడాకారులను ఎంపిక చేశారని వెల్లడించారు.
ఆదిత్యుని సన్నిధిలో భక్తజనం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కళకళలాడాయి. ఎండ తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో ఆలయం తరఫున మంచినీటిని పంపిణీ చేసినప్పటికీ..భక్తుల దాహం తీర్చలేకపోయారనే విమర్శలు వినిపించా యి. పలువురు వీఐపీలు ఆదిత్యుని దర్శనానికి రావడంతో గౌరవ స్వాగతాలు, ప్రత్యేక దర్శనాల ఏర్పా ట్లు చేశారు. దేవదాయశాఖ మాజీ కార్యదర్శి సుందరకుమార్ కుటుంబసమేతంగా ఆదిత్యుడిని దర్శించుకున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ చాగంటి సన్యాసిరాజు నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆలయ సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులుకు విరాళ నగదును అందజేయగా అందు కు తగిన రశీదును ఆయన దాతలకు అందజేశారు. వివిధ దర్శనాల టిక్కెట్ల ద్వారా రూ.2,67,800, విరాళాల ద్వారా రూ. 78,417, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 1.80 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలియజేశారు.