
రైలు నుంచి జారిపడి వలస కార్మికుడి మృతి
రాయగడ: జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇచ్ఛాపూర్ పంచాయతీలోని కాసెర గ్రామానికి చెందిన కును గౌడ (17) అనే యువకుడు ప్రమాదవసాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. గత కొద్ది నెలల క్రితం కును తన స్నేహితులతో కలిసి ఉపాధి కోసం కేరళకు వెళ్లాడు. పనులు ముగించుకుని శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చేందుకు ట్రైన్‌లో బయలు దేరాడు. తిరుచూర్–పాలకాడ్ రైలులో డొర్ వద్ద నిలబడి ఉండటంతో ప్రమాదవసాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు.. ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబీకులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అవసరమయ్యే డబ్బులు లేకపొవడంతో జిల్లా కార్మిక శాఖ అధికారులకు కును తల్లిదండ్రులు ఆశ్రయించారు. దీనిపై స్పందించిన అధికారులు అవసరమయ్యే ఖర్చులు భరించి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు హామీ ఇచ్చారు.
విద్వేషాలు రెచ్చగొట్టడం తగదు
శ్రీకాకుళం అర్బన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పాలన సాగిస్తోందని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. దీనిని ఎదురిస్తున్న కాంగ్రెస్ నాయకులను మట్టు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆస్తులు మీద, పార్టీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేయడం విడ్డూరమన్నారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదన్నారు. బీజేపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు.